కూటమి పాలనలో ఏపీకి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. ఇప్పటికే గడచిన 8 నెలల కాలంలోనే ఏపీకి దాదాపుగా రూ.7 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. తాజాగా ఈ పెట్టుబడులన్నింటినీ తలదన్నేలా లక్షల కోట్ల మేర పెట్టుబడులకు మార్గం చూపేలా ఏపీకి మరో భారీ పెట్టుబడి వచ్చేసింది. ఏపీలో ఏకంగా రూ.49 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు టాటా కంపెనీ ముందుకు వచ్చింది.
ఈ మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం, టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీల మధ్య శుక్రవారం ఒప్పందం కుదిరింది. ఇదివరకే ఏపీలో టాటా అనుబంధ కంపెనీ టీసీఎస్ విశాఖలో తన డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా టాటాలకు చెందిన మరో అనుబంధ కంపెనీ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ ఏపీలో అడుగు పెడుతోంది.
ఈ ఒప్పందం మేరకు రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ భారీ పెట్టుబడులు పెట్టనుంది. తొలి విడతలో రూ.49 వేల కోట్ల పెట్టుబడితో టాటా కంపెనీ ఏపీలోకి అడుగు పెట్టనుంది. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధి, కొత్త అవకాశాల అన్వేషణలో టాటా కంపెనీ ఈ పెట్టుబడులను పెట్టనుంది. ఈ పెట్టుబడితో రానున్న ఐధేళ్లలో రూ.10 లక్షల కోట్ల మేర పెట్టుబడులు ఏపీకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ పెట్టుబడితో ఏపీలో రెన్యూవబుల్ ఎనర్జీకి సరికొత్త జవ జీవాలు వచ్చినట్టేనని చెప్పొచ్చు. ఇప్పటికే రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో ఏపీ అగ్రగామిగానే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా టాటాల పెట్టుబడి ఈ రంగంలో ఏపీని తిరుగులేని స్థాయిలో నిలబెడుతుందని చెప్పక తప్పదు.
ఏపీ ప్రభుత్వం, టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ ల మధ్య కుదిరిన ఒప్పందం సందర్భంగా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను చేరుకునేందుకు టాన్ఫఫర్మేషన్ ను వేగవంతం చేయాలని సీఎం నారా చంద్రబాబునాయుడు సాగుతున్నారని తెలిపారు. చంద్రబాబు దార్శనికతకు అనుగుణంగానే ఈ ఒప్పందం కుదిరినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇక టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దీపేశ్ నందా మాట్లాడుతూ ఏపీతో ఈ ఒప్పందం కుదరడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, చీఫ్ సెక్రటరీ విజయానంద్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.