వైసీపీ అధినే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై శుక్రవారం నాటి ఏపీ కేబినెట్ లో సుదీర్ఘ చర్చ జరిగింది. అమరావతిలోని సచివాలంలో సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం తర్వాత ఏపీ కేబినెట్ భేటీ జరిగిన సంగతి తెలిసిందే. కేబినెట్ భేటీలో అజెండా అంశాలపై చర్చ ముగిసిన తర్వాత వివేకా హత్య కేసును స్వయంగా చంద్రబాబే ప్రస్తావించారు. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్ మన్ రంగన్న మృతి చెందడం అనుమానాస్పదంగానే ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ మృతి ముమ్మాటికీ అనుమానాస్పదమేనని కూడా ఆయన అన్నారు.
గత కొంతకాలంగా వయసురీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలో సతమతమవుతున్న రంగన్న బుధవారం ఉన్నట్లుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటీన పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా…అక్కడి వైద్యుల సలహా మేరకు కడపలోని రిమ్స్ కు తరలించారు. రిమ్స్ లో చికిత్స పొందుతూ రంగన్న మృతి చెందారు. రంగన్న మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయంటూ ఆయన భార్య చెప్పడంతో పోలీసులు కూడా రంగన్నమృతిని అనుమానాస్పదంగా పరిగణిస్తున్నారు. అంతేకాకుండా రంగన్న మృతితో వివేకా హత్య కేసు సాక్షుల మృతులు ఐదుకు చేరుకున్నాయి. ఈ అన్ని మరణాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు గురువారం కడప జిల్లా ఎస్పీ ప్రకటించారు.
ఇదిలా ఉంటే… కేబినెట్ భేటీలో రంగన్న మృతిని స్వయంగా చంద్రబాబే ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా రంగన్నను పోలీసులే చంపేశారని తాము తొలుత అనుకున్నామని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారట. దీంతో అక్కడే ఉన్న డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా… రంగన్న మృతిపై సమగ్ర వివరాలను మంత్రుల ముందు పెట్టారట. చంద్రబాబు అనుమానించినట్లే రంగన్న మృతి అనుమానాస్పదంగానే ఉన్నట్లు తమ విచారణలోనూ తేలిందని కూడా డీజీపీ చెప్పారట. అయినా ఇదేంటీ… వివేకా హత్య కేసులో సాక్షులుగా ఉన్న వారంతా ఇలా వరుసబెట్టి చనిపోతూ ఉంటే… ఇక కేసు నిలబడేదెలా? అని కూడా చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారట. ఇదంతా చూస్తుంటే… వివేకా హత్య కేసు సాక్షుల మరణాల వెనుక మిస్టరీ ఉందన్న అనుమానాలు అంతకంతకూ బలపడుతున్నాయి.