వైసీపీ మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు పేర్ని వెంకట్రామయ్య ఉరఫ్ పేర్ని నాని వ్యవహారంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదలకు ఇచ్చే బియ్యాన్ని దారి మళ్లించారంటూ.. పేర్ని కుటుంబంపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. పేర్ని ఫ్యామిలి వైసీపీ హయాంలో సొంతగా గోడౌన్లు నిర్మించింది. దీనిలో పౌర సరఫరాల శాఖకు చెందిన బియ్యాన్ని నిల్వ చేస్తున్నారు. అయితే.. కూటమి సర్కారు వచ్చాక.. నిల్వలను లెక్కించింది.
ఈ క్రమంలోనే దాదాపు వేల కోట్ల రూపాయల రేషన్ బియ్యం పేర్ని సతీమణి పేరిట ఉన్న గోడౌన్లలో మిస్స య్యాయి. అప్పట్లోనే సర్కారుకు కోట్ల రూపాయల పెనాలిటీ రూపంలో చెల్లించారు. అయితే.. పెనాలిటీ కట్టినా కేసులు కొనసాగుతాయని.. పేదల బియ్యాన్ని దారి మళ్లించి వేల కోట్లు సొమ్ము చేసుకున్నారని సర్కారు అప్పట్లో తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే పేర్ని నానిపైనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో పేర్ని ఏ-6గా ఉన్నారు. దీంతో తనను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని ఆయన భావించారు.
ఈ క్రమంలోనే చాలా రోజుల పాటు మీడియా ముందుకు రాకుండా తప్పించుకుని తిరిగారు. గత నెల ప్రారంభంలో ఈ వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశం అయింది. తాజాగా పేర్ని నాని.. హైకోర్టును ఆశ్రయించి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పోలీసులు అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరారు. ఈ పిటిషన్‌పై పలుమార్లు విచారించిన హైకోర్టు.. తాజాగా పేర్ని నానికి ముందస్తు బెయిల్ ఇచ్చింది. అయితే.. పేదల బియ్యాన్ని దారి మళ్లించడం తీవ్రమైన అంశమని పేర్కొంది.
“పేదలకు ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని మీరు దారిమళ్లించడం నిజమైతే.. దీనికి సంబంధించిన ఆధారాలు నిరూపిస్తే.. తీవ్రంగా పరిణగమించాల్సి ఉంటుంది. ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అందిస్తున్న ఆహారాన్ని పేదలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంటుంది” అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇకపై.. ఇలాంటి తప్పులు చేసేవారిని వదిలి పెట్టుకుండా.. కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.