‘కాకినాడ’ దెబ్బ ఇంత గట్టిగా తగిలిందా?

భారత పారిశ్రామిక విఫణిలో బుధవారం ఓ కీలక పరిణామం వెలుగు చూసింది. దేశీయ ఫార్మా రంగంలో సత్తా చాటుతున్న అరబిందో ఫార్మా… సింగపూర్ కంపెనీతో చేసుకున్న అత్యంత కీలకమైన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. సాధారణంగా కీలక ఒప్పందాలు… ప్రత్యేకించి అంతర్జాతీయ స్థాయి ఒప్పందాలు రద్దు చేయాల్సి వచ్చినప్పుడు అందుకు గల కారణాలను ఆయా కంపెనీలు వెల్లడిస్తూ ఉంటాయి. ఆ ఒప్పందాల రద్దుకు దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ విచారం వ్యక్తం చేస్తూ సాగుతాయి. అయితే సింగపూర్ కంపెనీతో కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసుకున్న అరబిందో… అందుకు గల కారణాన్ని మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం.

రాజకీయాల నుంచి సన్యాసం తీసుకున్న వైసీపీ మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి అల్లుడి కుటుంబానికి చెందిన కంపెనీనే అరబిందో ఫార్మా. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన శరత్ చంద్రారెడ్డి ఈ కంపెనీని నడిపిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం కాకముందు వరకు ఈ కంపెనీ సాదాసీదా కంపెనీగానే రాణించింది. ఎప్పుడైతే వైఎస్ సీఎం అయ్యారో… అప్పుడే ఈ కంపెనీ విస్తరణకు రెక్కలొచ్చేశాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదు అయిన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్నకేసుల్లో ఈ కంపెనీ యాజమాన్యం కూడా చిక్కుకుంది. ప్రత్యేకించి క్విడ్ ప్రో కో ఆరోపణలు ఈ కంపెనీపై వచ్చాయి. ఇక 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం, ఆపై కరోనా రంగ ప్రవేశం.. ఈ కంపెనీకి బాగా కలిసి వచ్చాయి. ఈ కంపెనీ ఔషథం డోలో విక్రయాలు ఒక్కసారిగా రాకెట్ లా దూసుకుపోగా… నోట్ల కట్టలతో అరబిందో ఫార్మా గదులన్నీ నిండిపోయాయి.

అప్పటిదాకా ఫార్మా రంగానికి మాత్రమే పరిమితం అయిన అరబిందో రియాల్టీ రంగాల్లోనూ అడుగు పెట్టింది. పోర్టుల్లోకీ
ఎంట్రీ ఇచ్చేసింది. కాకినాడ సెజ్ తో పాటు కాకినాడ సీ పోర్టులపై కన్నేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త కేవీ రావు చేతిలోని ఈ రెండు కంపెనీలను నిబంధనలకు విరుద్ధంగా లాక్కుంది. అందుకోసం జగన్ చేతిలోని అధికారాన్నే ఆయుధంగా వాడుకుంది. జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి దగ్గరుండి మరీ ఈ కంపెనీలను అరబిందోకు రాయించేశారు. వేల కోట్ల రూపాయల నెట్ వర్త్ ఉన్న ఈ కంపెనీలకు తమ ఇష్టం వచ్చినట్లుగా ఏవో కొన్ని మెతుకులు విసిరిసనట్టుగా వ్యవహరించారు. విక్రాంత్ బెదిరింపులకు జడిసిపోయిన కేవీ రావు… చేసేది లేక చేతిలో పెట్టిన దానితోనే సర్దుకుపోక తప్పలేదు. అయితే ఇప్పుడు ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో పరిస్థితి తారుమారైంది.

కేవీ రావు ఫిర్యాదుతో విక్రాంత్ పై కేసు నమోదు అయిపోయింది. సాయిరెడ్డికీ ఇందులో పాత్ర ఉందని కేవీ రావు చెబుతున్నారు. ఇలాంటి క్రమంలో అల్లుడి కుటుంబాన్ని కాపాడుకునే నిమిత్తం రాజీ మంత్రాంగాన్ని నెరపిన సాయిరెడ్డి… పనిని గుట్టుగానే ముగించినట్టున్నారు. కాకినాడ సీ పోర్టు తిరిగి కేవీ రావు చేతికి వచ్చేసింది. కాకినాడ సెజ్ కూడా రావు చేతికి వచ్చినట్టేనన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఫలితంగా అరబిందో భారీగానే నష్టపోయినట్లు సమాచారం. తన వద్ద ఉన్న ఆర్థిక వనరులన్నింటినీ ఈ రాజీ కోసం ఆ సంస్థ వెచ్చించినట్టుగా తెలుస్తోంది. ఫలితంగా అప్పటికే కుదిరిన అంతర్జాతీయ స్థాయి ఒప్పందాలను అమలు చేసేందుకు ఆ సంస్థ వద్ద నిధులే లేకుండా పోయినట్లు సమాచారం. ఫలితంగా ఆ ఒప్పందాలను రద్దు చేసుకోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అరబిందో అనుబంధ సంస్థ అరో వ్యాక్సిన్స్ 2023లో సింగపూర్ కు చెందిన మిల్లేమాన్ ల్యాబ్స్ తో ఓ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. చిన్న పిల్లల్లో ధనుర్వాతం, కోరింత దగ్గు వంటి ఐదు ప్రాణాంతక వ్యాధుల నివారణ కోసం వినియోగించే పెంటావలెంట్ వ్యాక్సిన్ల తయారీ కోసం ఈ ఒప్పందం జరిగింది. ఔషథ తయారీలో ఈ ఒప్పందం అత్యంత కీలకమైనదే కాకుండా… అరబిందో లాంటి సంస్థలకు అత్యంత ప్రాధాన్యం కలిగిన ఒప్పందంగా దీనిని పరిగణిస్తున్నారు. అయితే ఈ ఒప్పందాన్ని అరబిందో ఫార్మా రద్దు చేసుకుంది. ఈ మేరకు రెగ్యులేటరీ సంస్థలకు అధికారికంగానే తెలియజేసింది. ఈ విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. ఇంతటి కీలక ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి గల కారణాలను అరబిందో మాట మాత్రంగానైనా వెల్లడించకపోవడం గమనార్హం.