అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టి రసాభాస చేసిన వైనం విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ ఘటనపై ఈ రోజు శాసనసభలో మంత్రి లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు బాధ్యత లేకుండా అడ్డుకొని వాకౌట్ చేశారని లోకేశ్ మండిపడ్డారు. తాము గతంలో బెంచిల దగ్గరే నిరసన వ్యక్తం చేసేవారమని, పోడియం దగ్గరకు రాలేదని, ఎప్పుడు లక్ష్మణ రేఖ దాటలేదని లోకేశ్ అన్నారు.
ఎవరు ఎక్కడ ఉండాలో ఎవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలో నిర్ణయించేది ప్రజలని లోకేశ్ చెప్పారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడుపై సాక్షి పత్రికలో తప్పుడు రాతలు రాయడం బాధాకరమని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పై వ్యక్తిగత ఆరోపణలు సభ పరువును తగ్గిస్తున్నాయని అన్నారు. గతంలో చంద్రబాబుకు 23 మంది సభ్యులు ఉన్నారని, ఐదుగురిని లాగేస్తే ఆయనకు ప్రతిపక్ష హోదా దక్కదని ఇదే సభలో జగన్ చేసిన వ్యాఖ్యలను లోకేశ్ గుర్తు చేశారు. అటువంటప్పుడు 11 మంది సభ్యులున్న జగన్ ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతారని లోకేశ్ నిలదీశారు.
ఇక జగన్ కు ఉప ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా జడ్ ప్లస్ సెక్యూరిటీ కేటాయించామని లోకేష్ చెప్పారు. ప్రతిపక్ష హోదాపై వైసీపీ సభ్యులు చేస్తున్న వ్యాఖ్యలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఎవరు అధికారంలో ఉన్నా ఇది కరెక్ట్ కాదని, చట్టసభలో అర్థవంతమైన చర్చలు జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుందని లోకేశ్ చెప్పారు. చిన్నప్పటి నుంచి ఈ సమావేశాలు చూస్తూ పెరిగానని, గతంలో వ్యక్తిగత దూషణలు ఉండేవి కావని లోకేష్ గుర్తు చేసుకున్నారు.