రాజకీయాల్లో విలువల గురించి ప్రతి ఒక్కరు మాట్లాడేవారే. మాటలకు భిన్నంగా చేతల్లో చూపించే వారు వేళ్ల మీద లెక్కించొచ్చు. ఒకవేళ ఉన్నా.. అత్యుత్తమ స్థానాల్లో ఉండేవారు చాలా తక్కువగా ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్. మొదటి పర్యటనలోనే అందరి చూపు ఆమె మీద పడింది. గతంలో రాష్ట్రానికి పార్టీ ఇంఛార్జులుగా ఉన్న వారికి భిన్నంగా సింపుల్ గా ఉండటం.. ట్రైన్ లో హైదరాబాద్ కు చేరుకోవటం.. తనకు స్వాగతం పలుకుతూ హోర్డింగ్ లను పెడితే.. వాటిని తీసేయించటం.. పూలమాలలకు.. సత్కారాలకు.. బహుమానాలకు దూరంగా ఉంటూ ఆమె తరచూ వార్తల్లో వ్యక్తిగా మారుతున్నారు.
ఎందుకంటే.. కాంగ్రెస్ లాంటి పార్టీలో ఈ తరహాలో ఒక నేత ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా ఆమె ప్రజాస్వామ్య పరిరక్షణలో రాజకీయ పార్టీలు.. ప్రజా ఉద్యమాల పాత్ర అనే అంశంపై వివిధ రాజకీయ పార్టీలతో ప్రతినిధులతో సదస్సు జరిగింది. హైదరాబాద్ లో జరిగిన ఈ సదస్సులో పాల్గొన్న ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒక విధంగా రేవంత్ సర్కారుకు హెచ్చరికలు చేశారా? అన్న రీతిలో ఉండటం గమనార్హం.
ఆమె చేసిన వ్యాఖ్యల్ని క్లుప్తంగా చూస్తే..
- ప్రజాస్వామ్యంలో అణచివేతకు తావులేదు. ప్రజాఉద్యమాలను అడ్డుకోవటం రాజ్యాంగ విరుద్ధం. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ముఖ్యమంత్రి.. ప్రధానమంత్రి.. ఎవరైనా సరే.. ప్రజాభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా ఇష్టానుసారంగానిర్ణయాలు తీసుకుంటామంటే కుదరదు.
- ఏకపక్షంగా పాలన సాగించటానికి ఇదేమీ రాచరికం కాదు. అధికారాన్ని ప్రజలపై బుల్డోజర్ నడపటానికి కాక.. వారి సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలి.
- మూసీ నిర్వాసితులతో సంభాషించటానికి వెళ్లిన మేధాపాట్కర్ ను సోమవారం స్థానిక పోలీసులు అడ్డగించిన అంశాన్ని తన మాటలతో చెప్పకనే చెప్పేశారు. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో సమర్థనీయం కాదన్న ఆమె.. తాను ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా సభలో హాజరు కాలేదన్నారు. తానో సర్వోదయ ఉద్యమ కార్యకర్తగా వచ్చినట్లు పేర్కొన్నారు.
- రాజకీయ పార్టీలు తగి తప్పినప్పుడు వాటిని సరైన దిశగా తీసుకెళ్లగలిగేవి ప్రజా ఉద్యమాలే. ఆందోళనాకారులను ప్రభుత్వాలు శత్రువుల్లా భావించకూడదు. మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా దిగ్విజయ్ సింగ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట రోజంతా నిరసనలు సాగేవి. సాయంత్రమైతే.. ఉద్యమకారులు.. పాలనాధికారులు కలిసి చోళే బఠానీ తింటూ కబుర్లు ఆడుకునేవారు.
- ప్రజా శ్రేయస్సు కన్నా.. కార్పొరేట్ ప్రయోజనాలే పరమావధిగా పని చేస్తున్నాయి. పౌరులకు.. పర్యావరణానికి శ్రేయస్కరం కాని విధానాలు రూపొందిస్తుండటం బాధాకరం.
ఇలా తన ఆలోచనల్ని చెప్పటం ద్వారా.. రేవంత్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను సూటిగా చెప్పేశారన్న మాట వినిపిస్తోంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. తాను ఉన్న హోదాకు భిన్నగా సింఫుల్ గా ఈ కార్యక్రమానికి హాజరైన ఆమె.. పది నిమిషాల ముందే రావటం ఒక ఎత్తు అయితే.. వచ్చినప్పటికి నుంచి వేదిక మీద ప్రసంగించే వరకు చరకాతో నూలు వడుకుతూ ఉండటం గమనార్హం.
అంతేకాదు.. ఆమెను కలిసిన వామపక్షవాదులు ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ నువేదికగా చేయొద్దని.. ముఖ్యమంత్రి రేవంత్ కు చెప్పాలని సూచన చేయగా.. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు. చివర్లో సదరు వేదిక మీద నుంచి బయటకు వస్తున్న వేళ.. కొందరు కాంగ్రెస్ నేతలు పార్టీ కండువాల్ని తీసుకొని ఆమెకు వేస్తూ.. హడావుడి చేసే ప్రయత్నాలకు ఆమె మందలిస్తూ.. ‘ఇది పార్టీ వేదిక కాదు. మీరు కలవాలంటే గాంధీభవన్ కు రండి’ అంటూ వారు ఇవ్వబోయిన పార్టీ కండువాలను పక్కన పెట్టేయటం చూసినప్పుడు మీనాక్షి నటరాజన్ రూటు సపరేటు అని అనుకోకుండా ఉండలేం.