ఏపీలో జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. కూటమి మద్దతిచ్చిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యేకంగా కొంతమంది నేతలను చంద్రబాబు నియమించారు. పోలింగ్ కు ముందు, తర్వాత కూడా ఆ నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే కూటమి బలపరిచిన అభ్యర్థులు విజయ ఢంకా మోగిస్తున్నారు. గుంటూరు-కృష్ణా జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆలపాటి రాజా ఘన విజయం సాధించారు.
తొలి రౌండ్ నుంచే ఆలపాటి రాజా మెజారిటీ దిశగా దూసుకుపోతున్నారు. 7వ రౌండ్ పూర్తయ్యేసరికి ఆలపాటి రాజాకు 1,18,070 ఓట్లు పోలయ్యాయి. దీంతో, మూడు సార్లు ఎమ్మెల్సీగా గెలిచిన కేఎస్ లక్ష్మణరావుకు ఘోర పరాజయం తప్పలేదు. జగన్ కు సన్నిహితుడిగా పేరున్న లక్ష్మణరావుకు ఈ ఎన్నికల్లో వైసీపీ పరోక్ష మద్దతునిచ్చింది. మొత్తం 2,41,873 ఓట్లు పోలయ్యాయి. 21,577 ఓట్లు చెల్లలేదు. దీంతో, రాజాను ఎన్నికల అధికారులు విజేతగా ప్రకటించారు.
7 రౌండ్లు ముగిసేసరికి ఆలపాటి రాజా 67,252 ఓట్ల మెజారిటీ సాధించారు. అయితే, బరిలో 25 మంది అభ్యర్థులు ఉండడంతో మొత్తం కౌంటింగ్ ప్రక్రియ పూర్తికావడానికి ఇంకా సమయం పడుతుంది. మంగళవారం ఉదయం 10 గంటలకల్లా కౌంటింగ్ పూర్తయ్యే అవకాశముంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా పోటీ చేయలేదు. పొత్తులో భాగంగా తెనాలి నియోజకవర్గం నాదెండ్ల మనోహర్ కు కేటాయించాల్సి వచ్చింది. దీంతో, రాజాను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చంద్రబాబు నిలబెట్టారు.
ఇక, ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి బలపరిచిన పేరా బత్తుల రాజశేఖర్ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. రెండో ప్రాధాన్య ఓట్లతో ఆయన విజయం సాధించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates