పోసాని బ‌య‌ట‌కు రావ‌డం క‌ష్టం.. రీజ‌నిదే!!

న‌టుడు, నిర్మాత, వైసీపీ మాజీ నాయ‌కుడు పోసాని కృష్ణ ముర‌ళి ఇప్ప‌ట్ల‌లో బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణం.. ఒక జిల్లా కాదు.. రెండు జిల్లాలు కాదు.. ఏకంగా.. 9 జిల్లాల్లో ఆయ‌న‌పై కేసులు న‌మోదు కావ‌డ‌మే. నిన్న మొన్న‌టి వ‌ర‌కు క‌డ‌ప జిల్లా రాయ‌చోటి నియ‌జ‌క‌వ‌ర్గం పోలీసులు మాత్ర‌మే ఆయ‌న‌పై కేసు న‌మోదు చేశార‌ని అనుకుంటే.. త‌ర్వాత న‌ర‌స‌రావు పేట పోలీసులు ముందుకు వ‌చ్చారు. మేం కోర్టు అనుమ‌తి తీసుకున్నాం.. మాకు అప్ప‌గించాలంటూ..వారు రాయ‌చోటి పోలీసుల‌పై ఒత్తిడి తెచ్చారు.దీంతో రాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గం పోలీసులు పోసానిని న‌ర‌స‌రావు పేట పోలీసుల‌కు అప్ప‌గించారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు.. మ‌రిన్ని జిల్లాల‌కు చెందిన పోలీసులు.. పోసాని కోసం ముందుకు వ‌చ్చారు. ఏపీ వ్యాప్తంగా పోసాని కృష్ణమురళి పై నమోదైన కేసుల‌ను వారు ఉటంకిస్తున్నారు. పోసాని పై 30కి పైగా ఫిర్యాదులు, 14 కేసులు నమోదు చేసిన‌ట్టు ఉన్న‌తాధికారులు చెబుతున్నారు. వీటిలో నరసరావుపేట, బాపట్ల, అనంతపురం, యాదమరి(క‌ర్నూలు), పుత్తూరు, విజయవాడ, పాలకొండ, పాతపట్నంలో పోసానిపై కేసులు న‌మోద‌య్యాయ‌య‌ని వివ‌రించారు. నరసరావుపేట పీఎస్‌లో నమోదైన కేసులో ఇప్పటికే పీటీ వారెంట్‌పై విచారణ చేప‌ట్టారు.

పల్నాడు జిల్లా నరసరావుపేట కోర్టుకి పోసాని కృష్ణమురళిని తీసుకొచ్చిన పోలీసులు.. ఆయ‌న‌ను మెజిస్ట్రేట్ ముందు హాజ‌రు ప‌రిచి త‌మ క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. ఇదే బాట‌లో ఇత‌ర జిల్లాల పోలీసులు కూడా న‌డ‌వ‌నున్నారు. అయితే.. వంతుల వారీగా.. ఒక‌రు త‌ర్వాత‌.. పోసానిని అదుపులోకి తీసుకునే అవ‌కాశం ఉంద‌ని అధికారులు చెబుతున్నారు. అయితే.. దీనిపై వైసీపీ త‌ర‌ఫున న్యాయ‌వాదులు కోర్టును మ‌రోసారి ఆశ్ర‌యించారు. పోసానికి న్యాయం చేయాల‌ని కోరుతూ.. పిటిష‌న్ వేశారు.

అన్ని కేసులు సోష‌ల్ మీడియాకు సంబంధించిన వివాదా స్ప‌ద వ్యాఖ్య‌ల నేప‌థ్యంలోనే న‌మోదైన‌వి కావ‌డంతో.. అన్ని కేసులను ఒకే ఎఫ్ ఐఆర్‌గా న‌మోదు చేసి.. ఒకే కేసుగా ప‌రిగ‌ణించి.. పోలీసు హెడ్ కార్ట‌ర్స్‌కు అప్పీల్ చేసుకునేలా కోర్టు ఆదేశించాల‌ని కోరారు. అయితే.. దీనిపై విచార‌ణ జ‌ర‌గాల్సి ఉంది. అప్ప‌టి వ‌ర‌కు పోసానికి రిలీఫ్ ఉండే అవ‌కాశం లేద‌ని న్యాయ‌వాద వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా చేసుకున్న‌వారికి చేసుకున్నంత అన్న‌ట్టుగా పోసాని వ్య‌వ‌హారం రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశం అయింది.