అమరావతిపై వైసీపీ వైఖరి మారుతోందా..?

నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ఆదిలో వైసీపీ కూడా ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ పార్టీ అధికారంలోకి వచ్చినంతనే.. ఎందుకనో గానీ అమరావతిపై ఆ పార్టీ తన వైఖరిని మార్చుకుంది. తాజాగా ఇప్పుడు వైసీపీ మళ్లీ విపక్ష పార్టీగా మారిపోయింది కదా. ఈ నేపథ్యంలో అమరావతిపై ఆ పార్టీ తన వైఖరిని మార్చుకునే దిశగా సాగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వాదనలు నిజమేనన్నట్లుగా సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బొత్స వ్యాఖ్యలు వింటే.. అమరావతిపై వైసీపీ వైఖరి మారిపోయినట్టేనని కూడా చెప్పక తప్పదు.

అయినా మండలిలో అమరావతి గురించి బొత్స ఏమన్నారన్న విషయానికి వస్తే… గతంలో అమరావతిని రాజధానిగా ఒప్పుకున్నాం. అయితే అమరావతి నిర్మాణానికి లక్షల కోట్ల నిధులు కావాలని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అంతమేర నిధులు అమరావతికి కేటాయించలేని పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే నాడు అమరావతిని స్మశానం అన్నాం. ఇందులో వివాదమేమీ లేదు. ఆ తర్వాత మూడు రాజధానుల దిశగా నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ఏమిటన్న దానిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని బొత్స నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. వెరసి అమరావతిపై వైసీపీ వైఖరి మారే అవకాశాలు లేకపోలేదని బొత్స వ్యాఖ్యల ద్వారా తేటతెల్లం అవుతోంది.

గతంలో ఏపీ రాజధానిగా అమరావతికి తాము కూడా అనుకూలమేనని స్వయంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా… రాష్ట్ర రాజధాని అయిన అమరావతిలోనే తాను ఇల్లు కట్టుకుంటాను అని చెప్పిన జగన్… ఆ మేరకు అమరావతి పరిధిలోని తాడేపల్లిలో స్థలం కొనుగోలు చేసి… అందులో ఇంటితో పాటు పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించుకున్నారు. 2019 ఎన్నికలు జరిగే దాకా జగన్ ఇదే స్టాండ్ పై సాగారు. అయితే ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో 151 సీట్లతో వైసీపీ ఘన విజయం సాధించిందో… ఆ మరుక్షణమే అమరావతిపై జగన్ తన వైఖరిని మార్చేశారు. మూడు రాజధానులు అంటూ కొత్త రాగం అందుకున్నారు. జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతికి భూములు ఇచ్చిన రాజధాని రైతులు ఏళ్ల తరబడి నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే.