పవన్ వ్యూహంతో ‘ఏటికొప్పాక’కు మరో గౌరవం

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజా సేవలో తనదైన ముద్రతో సాగిపోతున్నారు. పల్లె ప్రగతి కోసం పవన్ అనుసరిస్తున్న వ్యూహాలు లెక్కలేనన్ని లాభాలను ఆర్జించి పెడుతున్నాయి. పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న వ్యూహాల ఫలితంగా ఉత్తరాంధ్రకు చెందిన ఏటికొప్పాక బొమ్మలకు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఓ అరుదైన గుర్తింపు దక్కింది. భారత ప్రథమ పౌరుడు రాష్ట్రపతి అధికారిక నివాసంగా కొనసాగుతున్న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఏటికొప్పాక బొమ్మల స్టాల్ ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ లో ఈ స్టాల్ ను ఏర్పాటు చేసేందుకు ఏటికొప్పాక గ్రామానికి చెందిన శరత్ అనే కళాకారుడికి ఈ అరుదైన అవకాశం దక్కింది.

ఇటీవలి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏపీ ప్రభుత్వం ఏటికొప్పాక బొమ్మల కొలువులతో కూడిన శకటాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. పరేడ్ అందరినీ ఆకట్టుకున్న ఈ శకటానికి తృతీయ బహుమతి లభించింది. బహుమతి వచ్చిందన్న విషయాన్ని పక్కనపెడితే… ఏటికొప్పాక కళాకృతులతో రూపొందిన ఈ శకటాన్ని పరేడ్ కు హాజరైన వారంతా అలా కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత ఈ బొమ్మలకు సంబంధించిన విశేషాల గురించి చాలా మంది ఇంటర్నెట్ లో శోధించారు. రసాయనాల్లేని రంగులతో… మృదువైన కలపతో…రూపొందే ఈ బొమ్మలు పిల్లలు ఆడుకోవడానికి అన్నింటికంటే ఉత్తమమైనవని తెలుసుకుని సంబ్రమాశ్చర్యాలకు గురయ్యారు.

ఇప్పటికే ఏటికొప్పాక బొమ్మలకు దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగానూ మంచి గుర్తింపే ఉంది. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ లో ఏటికొప్పాక బొమ్మల స్టాల్ కు అనుమతి లభించడం మరో అరుదైన ఘనతగానే చెప్పుకోవాలి. రాష్ట్రపతి భవన్ ను సందర్శించే వారంతా ఈ బొమ్మల పట్ల తప్పనిసరిగా ఆకర్షితులు కావడం తప్పనసరి. ఈ లెక్కన ఏటికొప్పాక కళాకృతులకు మరింత ప్రాచుర్యం లభించడంతోె పాటుగా ఆ కళాకారులకు మంచి ఉపాధి అవకాశాలు కూడా లభించే అవకాశాలున్నాయి. వెరసి పవన్ మార్కు వ్యూహంతో ఏటికొప్పాక కళాకృతుల మార్కెట్ భారీగా విస్తరించడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి.