పీఏ ఇంట శుభకార్యానికి సతీసమేతంగా లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ జనంలోకి చొచ్చుకుని వెళుతున్నారు. ఎక్కడో అమెరికాలోని స్టాన్ ఫోర్ట్ వర్సిటీలో ఉన్నత చదువులు చదివిన లోకేశ్.. ఆ హైఫై కల్చర్ ను ఎప్పుడో పక్కనపెట్టేశారని చెప్పాలి. ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో… ప్రజా సేవే లక్ష్యంగా ఆయన సాగుతున్నారు. తొలుత టీడీపీలో పార్టీ సమన్వయకర్త హోదాతో రాజకీయ అడుగులు ప్రారంభించిన లోకేశ్.. పార్టీ కార్యకర్తలకు బీమా సౌకర్యంతో తొలి అడుగే అద్భుతమనిపించారు. ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తున్న లోకేశ్ అంచెలంచెలుగానే ఎదుగుతున్నారు. ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో విద్య, ఐటీ శాఖల మంత్రిగా నిత్యం బిజీగా ఉంటున్న లోకేశ్… తన నియోజకవర్గం గానీ, తన పార్టీ గానీ, తన వద్ద పనిచేసే వాళ్లు గానీ పిలిస్తేనే పలికేంత దగ్గరగా ఆయన సాగుతున్న తీరు అభినందనీయమే.

అసలే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. పార్టీ సభ్యులను మేల్కొలపడంతో పాటు తన శాఖకు సంబంధించిన వ్యవహారాలపైనా ఆయన సిద్ధం కావాల్సి ఉంది. ఈ లెక్కన క్షణం కూడా తీరిక లేకుండా సాగుతున్న లోకేశ్… తన వద్ద చాలా కాలంగా పర్సనల్ అసిస్టెంట్ (పీఏ)గా పనిచేస్తున్న సాంబశివరావు ఇంట నిశ్చితార్థ వేడుక అనగానే.. ఆ వేడుకకు లోకేశ్ సతీసమేతంగా హాజరయ్యారు. సాంబశివరావు కుమార్తె నిశ్చితార్థం ఆదివారం విజయవాడలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి లోకేశ్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన లోకేశ్ దంపతులు… వారి ఆనందాన్ని ఇనుమడించేలా వారితో కొద్దిసేపు ముచ్చటించారు.

ఓ వైపు పార్టీ, మరోవైపు ప్రజా పాలనతో నిత్యం బిజీగా సాగుతున్న లోకేశ్ కు ఇప్పుడు ప్రతి క్షణం కూడా విలువైనదేనని చెప్పాలి. అసెంబ్లీకి విపక్షం డుమ్మా కొడుతున్నా… శాసనమండలిలో ఇప్పటికీ మెజారిటీ పక్షంగా సాగుతున్న వైసీపీ అధికార కూటమిపై విమర్శల దాడితో విరుచుకుపడుతోంది. ఈ సందర్భంగా తన తండ్రి, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి గానీ, జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు గానీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా… వారిని మండలికి రానీయకుండానే వైసీపీని లోకేశ్ చిత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఆయా అంశాలపై లోకేశ్ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆయన తన పీఏ కుమార్తె నిశ్చితార్థ వేడుకకు వెళ్లడం, అక్కడ వారితో తన సొంత మనుషుల మాదిరిగానే లోకేశ్ వ్యవహరించిన తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది.