మిష‌న్ లేదు-మీనింగూ లేదు: ష‌ర్మిల‌

ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన 2025-26 వార్షిక బ‌డ్జెట్‌పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. మిష‌న్ లేదు-మీనింగు లేద‌న్నారు. కేవలం అంకెలు, ఆర్భాటాలు త‌ప్ప‌.. ప‌స లేద‌ని పేర్కొన్నారు. “కూట‌మి ప్ర‌భుత్వం ప్రవేశ పెట్టిన బ‌డ్జెట్‌లో అంకెలు ఘ‌నంగా ఉన్నాయి. కానీ, కేటాయింపులు మాత్రం శూన్యంగా ఉన్నాయి” అని విమ‌ర్శించారు. బ‌డ్జెట్ మొత్తం డొల్లేన‌ని పేర్కొన్న ష‌ర్మిల‌.. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను ఏమాత్రం ఈ బ‌డ్జెట్ ప్ర‌తిబింబించ‌లేక పోయింద‌ని తెలిపారు. ఎన్నిక‌ల స‌మ‌యం లో ఇచ్చిన వాగ్దాల‌ను, సూప‌ర్ సిక్స్ హామీల‌ను కూడా విస్మ‌రించార‌ని వ్యాఖ్యానించారు.

రైతుల‌కు మేలు చేస్తామ‌న్న ప్ర‌భుత్వం కీల‌క‌మైన ‘అన్న‌దాత సుఖీభ‌వ‌’ ప‌థ‌కానికి కేవ‌లం 6300 కోట్లుకేటాయించి.. రైతులకు అన్యాయం చేశార‌ని ష‌ర్మిల అన్నారు. రాష్ట్రంలో అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కం కోసం 54 ల‌క్ష‌ల మంది అన్న‌దాత‌లు ఎదురు చూస్తున్న‌ట్టు తెలిపారు. అయితే.. కేంద్రం నుంచి వ‌చ్చే నిధుల‌తో దీనిని ముడిపెట్టి కేటాయింపులు త‌గ్గించేశార‌ని,త‌ద్వారా రైతుల‌కు మేలు జ‌ర‌గ‌క‌పోగా.. మ‌రిన్ని ఇబ్బందులు వ‌స్తాయ‌ని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. రైతుల‌కు సంబంధించిన ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధిని 3 వేల కోట్ల‌తో చేస్తామ‌ని ప్ర‌క‌టించి.. ఇప్పుడు కేవ‌లం 300 కోట్లు విదిలించార‌ని ఆమె పేర్కొన్నారు.

దీనివ‌ల్ల రైతుల‌కు మేలు ఎలా జ‌రుగుతుందో చెప్పాల‌న్నారు. అమ్మ‌లు అంద‌రూ ఎదురు చూస్తున్న త‌ల్లికి వంద‌నం ప‌థ‌కానికి కూడా.. నిధులు స‌రిగా కేటాయించ‌లేద‌న్నారు. 12600 కోట్లు అవ‌స‌రం కాగా.. కేవ‌లం 9407 కోట్లు మాత్ర‌మే కేటాయించ‌డం ద్వారా.. అమ్మ‌ల‌కు ఎలా నిధులు ఇస్తార‌న్నారు. ఎంత మంది పిల్ల‌లు ఉంటే.. అంత‌మందికీ ఇస్తామ‌ని అన్న విష‌యాన్నిఈ సంద‌ర్భంగా ష‌ర్మిల గుర్తు చేశారు. అదేవిధంగా ఉచిత సిలెండ‌ర్లు ఇచ్చే దీపం-2 ప‌థ‌కానికి 4500 కోట్ల రూపాయ‌లు అవ‌స‌రం కాగా.. కేవ‌లం 2601 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించి.. చేతులు దులుపుకొన్నార‌ని అన్నారు.

రాష్ట్రంలోని మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణాన్ని ఉగాది నుంచి అందిస్తామ‌ని చెప్పిన ప్ర‌భుత్వం ఇప్పుడు ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ లో క‌నీసం దాని ఊసు కూడా తీసుకురాలేద‌ని ష‌ర్మిల అన్నారు. దీనికి 350 కోట్ల‌రూపాయ‌లు కేటాయిస్తే స‌రిపోతుంద‌ని.. కానీ, అస‌లు దీని ప్ర‌స్తావ‌న కూడా చేయ‌లేద‌న్నారు. మ‌హిళా శ‌క్తి ప‌థ‌కం కింద 18 ఏళ్లు నిండిన వారికి ఇస్తామ‌న్న రూ.1500 సంగ‌తేంట‌ని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. ఈ విష‌యాన్ని కూడా బ‌డ్జెట్‌లో ప్ర‌స్తావించ‌లేద‌న్నారు. ఎంతో మంది నిరుద్యోగ యువ‌తులు.. ఈ నిధుల కోసం ఎదురు చూస్తున్న విష‌యాన్ని ఆమె గుర్తు చేశారు. అమ‌రావ‌తిని అప్పుల‌తో నిర్మించే ప్ర‌య‌త్నంచేస్తున్నార‌ని త‌ప్పుబ‌ట్టారు. అందుకే.. ఈ బ‌డ్జెట్‌లో మిష‌నూ లేదు.. మీనింగు లేద‌ని ఆమె వ్యాఖ్యానించారు.