తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కీలక నేత హరీష్‌రావుపై హైదరాబాద్ లోని బాచుపల్లి పోలీసులు.. కేసు నమోదు చేశారు. తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని.. తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ .. బాచుపల్లికి చెందిన చక్రధర్ గౌడ్ అనే 42 ఏళ్ల వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. హరీష్ రావుతో పాటు.. సంతోష్‌కుమార్, రాములు, వంశీ అనే వ్యక్తులు తనను బెదిరిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నా రు. వారినుంచి తనకు ప్రాణ రక్షణ కల్పించాలని వేడుకున్నారు.
చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు హరీష్‌రావుపై భారతీయ న్యాయ సంహిత (బీ ఎన్ ఎస్)లోని సెక్షన్ 351(2)(నేర పూరిత కుట్ర), రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. దీనిలో రెండో నిందితుడిగా(ఏ-2) హరీష్‌రావును పేర్కొన్నారు. త్వరలోనే ఆయనకు నోటీసులు ఇవ్వనున్నట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అన్ని కోణాల్లోనూ పరిశీలించిన తర్వాతే.. ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.
టన్నెల్ పై తగువు!
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాద ఘటన రాజకీయంగా దుమారానికి దారి తీసింది. ఇక్కడకు మాజీ మంత్రి హరీష్‌రావు రావడం.. ఆయనను పోలీసులు అడ్డుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీష్‌రావు రాష్ట్ర సర్కారుపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. రాజకీయ దురుద్దేశంతోనే హరీష్‌రావు విమర్శలు చేస్తున్నారని అన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ఆయన కుటుంబం… ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు.
ఈ సందర్భంగా హరీష్‌రావుకు జూపల్లి మూడు ప్రశ్నలు సంధించారు.
1) టన్నెల్‌ను 200 మీటర్లు తవ్వి మిగతాది ఎందుకు వదిలేశారు?
2) కాంట్రాక్లులో తక్కువ లాభం వస్తుందన్న అంచనాతోనే వదిలేశారా?
3) కాంగ్రెస్ హయాంలో చేపట్టిన టన్నెల్ నిర్మాణం పూర్తి అయితే మీకు పేరు రాదు కాబట్టి వదిలేశారా? అని నిలదీశారు. ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కుటుంబానికి, బీఆర్ ఎస్ నాయకులకు లేదన్నారు.