పేదలకు ఉచిత వైద్య సేవల రంగంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ జనాల్లోకి బాగా ఎక్కేసింది. ఉచిత వైద్యం అనే మాట వినిపించినంతనే… ఆరోగ్యశ్రీ పేరే గుర్తుకు వచ్చే పరిస్థితి. అలాంటి ఆరోగ్యశ్రీని మరిపించే మరో కొత్త ఆరోగ్య సేవల పథకానికి ఏపీలోని కూటమి సర్కారు శ్రీకారం చుడుతోంది. ప్రతి పేద కుటుంబానికి రూ.25 లక్షలతో ఆరోగ్య బీమా పథకాన్ని అందించే దిశగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చందరబాబునాయుడు చాలా రోజుల కిందే కసరత్తు మొదలుపెట్టారు. తాజాగా శుక్రవారం అసెంబ్లీ ముందుకు వచ్చిన 2025 26 బడ్జెట్ లో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఈ పథకం గురించి కీలక ప్రస్తావన చేశారు. ప్రతి పేద కుటుంబానికి రూ.25 లక్షల విలువైన ఆరోగ్య బీమాను ఈ ఏడాదే అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.
స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల తన బడ్జెట్ ప్రసంగంలో ఇంకా పేరు ఖరారు కాని ఈ పథకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారంటే.. ఈ పథకం త్వరలోనే పట్టాలెక్కడం ఖాయమే. ఈ పథకం కింద ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబానికి రూ.25 లక్షల మేర ఆరోగ్య బీమాను ప్రభుత్వం అందించనుంది. ఆరోగ్య బీమా అందించే సంస్థల నుంచి ఈ మేరకు బీమా సౌకర్యాన్ని అందించనున్నారు.
బీమాకు సంబంధించిన ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది. అంటే… ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు ఆయా కంపెనీలు అందిస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్ మాదిరిగా… బాబు సర్కారు.. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య బీమాను అందించనుందన్న మాట. ఈ బీమాకు అర్హులైన కుటుంబాలు… ప్రభుత్వం అందించే కార్డులతో నేరుగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి ఉచితంగానే వైద్య సేవలు పొందుతారు.
ఆరోగ్యశ్రీలో సర్కారు ఇచ్చిన కార్డులు తీసుకుని ముందుగా ఆరోగ్య మిత్రలను సంప్రదించి… వారు చెప్పిన సమయానికి ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆయా కార్డులకు సంబంధించి ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అనుమతి లభించిన తర్వాతే వైద్య సేవలు అందుతాయి. ఈ సేవల వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తున్న నేపథ్యంలో బిల్లుల మంజూరీలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఫలితంగా ఆరోగ్యశ్రీ చికిత్సలకు చాలా ఆసుపత్రులు అంతగా ఆసక్తి చూపడం లేదు. అదే ఇన్సూరెన్స్ సంస్థల నుంచి అందే హెల్త్ కార్డుల ద్వారా వెళ్లే వారికి మాత్రం సత్వరమే మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి.
ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే రీతిన ఆలోచించి.. పేద, మధ్య తరగతి కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ను ఇప్పించడం ద్వారా ఉద్యోగుల మాదిరే మెరుగైన వైద్య సేవలు సత్వరం అందుతాయని చెప్పొచ్చు. ఈ లెక్కన బాబు సర్కారు ప్రవేశపెట్టనున్న ఆరోగ్య బీమా పథకం.., వైఎస్ బ్రాండ్ స్కీంగా ప్రచారంలోకి వచ్చిన ఆరోగ్యశ్రీని మరిపిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.