వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే… నిజంగానే సినిమా చూపించకుండానే తప్పుకున్నంటున్నట్టుగా అనిపిస్తోంది. జగన్ కు ప్రతిపక్షంలో కూర్చోవడం ఇదే కొత్త కాదు. గతంలో 2014 ఎన్నికల్లోనూ వైసీపీ ఓడిపోగా… టీడీపీ అధికారం చేపడితే… ఆ ఐదేళ్లూ ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగారు. ప్రతిపక్ష నేత హోదాలో నాడు జగన్ దాదాపుగా మూడేళ్ల పాటు శాసనసభకు హాజరయ్యారు. అధికార పక్షం టీడీపీని తనదైన శైలిలో ఇరుకునపెట్టారు. తన వాగ్ధాటిని నిరూపించుకున్నారు. ఆ తర్వాత తమ మాటకు, తమకూ ప్రాధాన్యం దక్కడం లేదని ఆరోపించి ఆయన అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. ఆ వెంటనే పాదయాత్ర చేపట్టారు. సభలో వైసీపీకి జరిగిన అన్యాయాన్ని ఆయన జనానికి చెప్పుకున్నారు. జనం నమ్మారు. ఆ మరుసటి ఎన్నికల్లో జగన్ కు ఓటేశారు.
అయితే తాజాగా వైసీపీకి 11 సీట్లు మాత్రమే దక్కాయి. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని అధికార కూటమి తేల్చి చెప్పింది. అయితే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పించి సమావేశాలకు హాజరు కాలేమంటూ జగన్ బీష్మించారు. ఈ వాదనను సామాన్య జనం కూడా తప్పుబడుతున్నా… జగన్ ఎందుకో గానీ పట్టించుకోవడం లేదు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వరంటూ తనదైన శైలి వాదనను మాత్రమే వినిపిస్తున్న జగన్… తన పార్టీకి ఓట్లేసిన 40 శాతం మంది ఓటర్ల పక్షాన సభలో పోరాటం చేయాల్సిన గురుతర బాధ్యతను విస్మరిస్తున్నారు. ఇదే విషయం ఆయన చెవినబడుతున్నా… ఎందుకో గానీ… జగన్ ఆ దిశగా చెవి ఒగ్గడం లేదు. ఎంతసేపూ తనకు మైక్ ఇవ్వరన్న వాదనే తప్పించి.. అధికార పక్షాన్ని డిఫెన్స్ లో పడేసే మహదావకాశాన్ని ఆయన చేజేతులారా వదులుకుంటున్నారా? అన్న దిశగా ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేసింది.
వాస్తవంగా ఇప్పుడు 11 మంది సంఖ్యాబలంతోనే జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే… ఏం జరుగుతుంది? అధికార పక్షం 11 సీట్లే వచ్చాయని హేళన చేస్తారా?.. లేదంటే నాడు తమపై విరుచుకుపడ్డారు కదా… మేమూ విరుచుకుపడతామని కూటమి సభ్యులు అంటారా?.. అనునిత్యం విమర్శలు చేస్తూ వైసీపీకి మైకే ఇవ్వకుండా కూటమి వారి గొంతు నొక్కుతుందా?.. రఘురామకృష్ణ రాజు సభాధ్యక్ష స్థానంలో కూర్చుని జగన్ ను చూసి హేళనగా నవ్వుతారా?.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు జగన్ పట్ల కఠినంగా వ్యవహరిస్తారా?.. వీటిలో ఏది జరిగినా జగన్ కు మంచిదేగా. వైసీపీకి ఇంకా మంచిదేగా. చంద్రబాబు గౌరవ సభ అని పేర్కొన్న సభలో జగన్ కు అగౌవరం జరిగిందని జనంలో సింపతీ పెరుగుతుంది కదా. అదే సింపతీతో తర్వాతి ఎన్నికల్లో జగన్… కూటమిని మట్టి కరిపించవచ్చు కదా. మరి ఇంతటి మంచి అవకాశాన్ని జగన్ ఎందుకు వదులుకుంటున్నారో అర్థం కావడం లేదన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates