ప్రభుత్వానికి, స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య ఇఫుడున్న పంచాయితీ చాలానట్లు కొత్తగా మరో పంచాయితీ మొదలైంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కార్యాలయం నుండి తనకు అందిన లేఖపై నిమ్మగడ్డ మండిపోతున్నారు. తొందరలో జరుగబోయే తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక, ఎంఎల్సీ ఎన్నికలతో పాటు స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణపై ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో ఓ సమావేశం నిర్వహించబోతున్నారు. కాబట్టి ఈ నెల 26వ తేదీన జరగబోయే ఆ సమావేశానికి ఆహ్వానిస్తున్నట్లుగా నిమ్మగడ్డకు అందిన లేఖలో ఉంది.
అయితే నిమ్మగడ్డ విజయవాడలో లేని కారణంగా ఆయన పీఏ సదరు లేఖను అందుకున్నారు. లేఖను చదివిన తర్వాత అదే విషయాన్ని నిమ్మగడ్డకు ఫోన్ చేసి చెప్పారు. తర్వాత నిమ్మగడ్డ పీఏ నుండి ముఖ్య కార్యదర్శి పీఏకి జవాబుగా మరో లేఖ అందింది. అందులో ఏముందయ్యా అంటే తన హోదాకన్నా తక్కువగా ఉండే ముఖ్య కార్యదర్శి సమావేశం నిర్వహించి తనను రమ్మని పిలవటం ఏమిటి ? అంటూ మండిపోయారు. స్దానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ అన్నది తన పరిధిలోనిది అని స్పష్టం చేశారట.
ఉద్దేశ్యపూర్వకంగానే తనను అవమానం చేసిన కారణంగా ఇదే విషయాన్ని కోర్టులో తేల్చుకుంటానని కూడా నిమ్మగడ్డ తన లేఖలో స్పష్టం చేశారట. అయితే ఆ తర్వాత నిమ్మగడ్డకు ముఖ్య కార్యదర్శి ఆఫీసు నుండి ఫోన్ వెళ్ళిందట. ఎన్నికల కమీషన్ కార్యదర్శికి అందాల్సిన లేఖ పొరబాటున కమీషనర్ కార్యాలయానికి చేరిందని చెప్పారట. అయితే నిమ్మగడ్డ మాత్రం కావాలనే తనకు లేఖను అందించినట్లు అభిప్రాయపడ్డారట.
ఏదేమైనా స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నిర్వహించే ఎటువంటి సమావేశానికైనా తన అనుమతి లేకుండా ఎన్నికల కమీషన్ అధికారులు ఎవరు హాజరుకాకూడదని నిమ్మగడ్డ ఆదేశించారట. ఈ నెల 28వ తేదీన రాజకీయ పార్టీలతో స్ధానిక ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ ఓ సమావేశం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో మొదలైన కొత్త పంచాయితీ ఇంకెన్ని వివాదాలకు దారితీస్తుందో.