ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గత ప్రభుత్వ హయాంలో హద్దులు దాటి మాట్లాడిన, ప్రవర్తించిన ఒక్కొక్కరి పని పడుతోంది. ఇప్పటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా పలువురి మీద కేసులు నమోదయ్యాయి. అరెస్టులు జరిగాయి. తాజాగా నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి అరెస్టయ్యారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న పోసాని ఇంటికి వచ్చి మరీ రాయచోటి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అనారోగ్యంగా ఉన్నా ఆయన్ని అరెస్ట్ చేశారని.. ఈ అరెస్ట్ అక్రమమని.. రాజకీయాలతో ఇక సంబంధం లేదని చెప్పినా, సారీ చెప్పినా పోసానిని వదల్లేదని వైసీపీ వాళ్లు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. కానీ ఎన్నో తప్పులు చేసి ఇప్పుడు సారీ చెప్పి, రాజకీయాలకు దూరం అంటే ఎలా వదిలేస్తారని టీడీపీ, జనసేన మద్దతుదారులు కౌంటర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారాలా లోకేష్‌ల గురించి పోసాని దారుణాతి దారుణంగా, వ్యక్తిగతంగా మాట్లాడిన వీడియోలన్నీ బయటికి తీస్తున్నారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులెవరో ఫోన్ చేసి తనను తిట్టారని.. పవన్ కళ్యాణ్ గురించి పోసాని మాట్లాడిన మాటలు సభ్య సమాజం ఏమాత్రం సహించలేనివి. రాయడానికి వీల్లేని భాషలో ఆయన రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్ భార్య గురించి, కూతురి గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. మధ్యలో జర్నలిస్టులు అభ్యంతర పెట్టినా ఆయన ఆగలేదు. చంద్రబాబు, లోకేష్‌ల గురించి కూడా అంతే ఘోరంగా మాట్లాడారు.
ఇవన్నీ పక్కన పెడితే.. గత ఏడాది చంద్రబాబు అరెస్టయి, జైలు పాలైనపుడు పోసాని చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించి తీరాల్సిందే. “అవినీతి పనులు చేశాడు కదా. చేసినపుడు జైల్లో పెడతారు కదా. ఉండు బ్రహ్మాండంగా జైల్లో ఉండు. ఏడాదో ఏడాదిన్నరో ఉండి బయటికి వచ్చాక అయినా నిజాయితీగా ఉండు” అంటూ వెటకారంగా మాట్లాడాడు పోసాని. టీడీపీ వాళ్లు ఇప్పుడా వీడియోను పోస్ట్ చేసి బ్రహ్మాండంగా జైల్లో ఉండమంటూ పోసానికి సలహా ఇస్తున్నారు. పోసాని బూతులతో పాటు ఈ వీడియో సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.