వైసీపీ మాజీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టుపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏమీ అమలు కావడం లేదని ఆయన అన్నారు. ఎవరి పాపాలకు వారు మూల్యం చెల్లించక తప్పదని కూడా అనగాని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పోసాని వ్యవహారంలోనూ ఇదే జరిగిందని ఆయన అన్నారు. గత పాపాలకు ఫలితం అనుభవించక తప్పదని ఆయన పేర్కొన్నారు.
రాజకీయాల్లో అయినా… ఇంకే రంగంలో అయినా వ్యక్తిగత దూషణలకు తావు లేదని అనగాని అన్నారు. వ్యక్తిగత విమర్శలు సరికాదన్న విషయం ఒక్క వైసీపీకో, ఒక్క టీడీపీలో వర్తించేది కాదని… అందరికీ, అన్ని పార్టీలకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపారు. వ్యక్తిగత విమర్శల ద్వారా ఆయా వ్యక్తులు, వారి కుటుంబాలు ఎంతగా ఇబ్బంది పడతాయన్నవిషయాన్ని ఆరోపణలు గుప్పించే వారు పట్టించుకోరని అనగాని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు అవతలి వారి స్వేచ్ఛకు భంగం కలిగించేవేనని కూడా ఆయన తేల్చి చెప్పారు.
ఇదిలా ఉంటే… వైసీపీలో కొనసాగిన సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, జనసేనాని పవన్ కల్యాణ్ లపై పోసాని వరుసగా పరుష పదజాలాన్ని వినియోగించి దూషణలకు దిగిన సంగతి తెలిసిందే. అయితే మొన్నటి ఎన్నికల్లో కూటమి గెలిచినంతనే… తనకు బెదిరింపులు వస్తున్నాయని పోసాని ఆరోపించారు. ఆ తర్వాత తాను గతంలో చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా వైసీపీకి రాజీనామా చేస్తున్నానని.. ఇకపై రాజకీయాల జోలికే రానని, రాజకీయ వ్యాఖ్యలు చేయబోనని కూడా పోసాని పేర్కొన్న సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates