ఏపీ రాజధాని అమరావతి పనులకు సంబంధించి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కీలక అప్‌డేట్ ఇచ్చారు. రాజధానికి సంబంధించిన పనులకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చిందని పేర్కొన్నారు. మరో 10 రోజుల్లో టెండర్లను ఖరారు చేసి, పనులు అప్పగించనున్నట్టు వెల్లడించారు. దీంతో మార్చి 15వ తేదీ నుంచి పనులు శరవేగంగా జరుగుతాయన్నారు. కేంద్రం నుంచి సాయం.. సహా.. ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకుంటున్న రుణాలతో రాజధాని నిర్మాణాన్ని వడివడిగా ముందుకు తీసుకువెళ్లేందుకు సీఎం చంద్రబాబుఎంతో కృషి చేస్తున్నారని మంత్రి వివరించారు.
అయితే.. మార్చి 15లోగానే.. హోం శాఖకు సంబంధించి.. అంతర్జాతీయ స్థాయి ఫోరెన్సిక్ లేబొరేటరీ నిర్మాణం పూర్తవుతుందని మంత్రి అనిత వివరించారు. తాజాగా ఈ నిర్మాణ పనులను పరిశీలించిన ఆమె.. ప్రస్తుతం 90 శాతం నిర్మాణం పూర్తయినట్టు వివరించారు. మిగిలిన 10 పనులు కూడా వచ్చే పది రోజుల్లో పూర్తవుతాయని అధికారులు తనకు చెప్పారని వివరించారు. అమరావతి లో నిర్మిస్తున్న అంతర్జాతీయ స్థాయి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిర్మాణానికి 2017 డిసెంబర్‌లో తుళ్లూరులో అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. అయితే.. వైసీపీ రాకతో పనులు ఆగిపోయాయని.. కూటమి వచ్చాక పనులు శరవేగంగా పూర్తవుతున్నాయని వివరించారు.
ఏంటీ లేబొరేటరీ..
క్రిమినల్ నేరాలకు సంబంధించి నేరస్థులను పట్టుకోవడంతో పాటు, నేర నిరూపణలో శాస్త్రీయ ఆధారాల విశ్లేషణకు ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణం చేపట్టాలని గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో రాజధానిలో నిర్మించాలని సంకల్పించింది. దీనిలో భాగంగా తుళ్లూరులో మొత్తం మూడు బ్లాక్‌లలో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం బ్లాక్ 1 నిర్మాణం పూర్తి కావొచ్చింది. దీనిలో డీఎన్ఏ, నార్కోటిక్స్, బయోమెట్రిక్స్, సైబర్, బాలిస్టిక్స్, ఫోరెన్సిక్ అకౌంటింగ్‌కు సంబంధించిన ఎక్స్‌లెన్స్ కేంద్రాలు, ట్రైనింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగాలు ఏర్పాటు చేయనున్నారు.