దేశంలోని రాజకీయ నాయకుల్లో అత్యధికంగా సోషల్ మీడియా ట్రోలింగ్ ఎదుర్కొన్న వాళ్లలో నారా లోకేష్ ఒకడు. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీని సోషల్ మీడియా జనాలు ఒక ఆడుకునేవాళ్లు. ఇప్పటికీ ఆడుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నారా లోకేష్ అదే స్థాయిలో టార్గెట్ అయ్యాడు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎమ్మెల్సీ అయి మంత్రి పదవి చేపట్టడం, మరీ లావుగా ఉండి యువతను ఇన్‌స్పైర్ చేసేలా లేకపోవడం, విషయ పరిజ్ఞానంలో వెనుకబడటం, అన్నింటికీ మించి వేదికల మీద మాట్లాడేటపుడు తడబాటు లోకేష్‌కు ప్రతికూలంగా మారాయి.
లోకేష్‌ను ఒక అసమర్థుడిలా ప్రొజెక్ట్ చేస్తూ విపరీతంగా ట్రోల్ చేసేవాళ్లు నెటిజన్లు. అలాగే రాజకీయ ప్రత్యర్థులు కూడా లోకేష్‌ను ఎంతగా విమర్శించేవాళ్లో, ఎద్దేవా చేసేవాళ్లో తెలిసిందే.
ఐతే లాక్ డౌన్ టైంలో నారా లోకేష్ ఆత్మపరిశీలన చేసుకున్నాడో ఏమో తెలియదు కానీ.. ఈ మధ్య అతడిలో చాలా మార్పు కనిపిస్తోంది. తన లోపాలన్నింటినీ సవరించుకునే పనిలో పడ్డట్లే కనిపిస్తున్నాడు లోకేష్. ముందుగా తన అవతారాన్ని మార్చుకున్నాడు. బాగా సన్నబడి మామూలు స్థాయికి చేరాడు. భాష మీద పట్టు సాధించాడు. బెదురు పోయింది. స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అన్నింటికీ మించి జనాల్లో తిరుగుతున్నాడు.
ప్రజల ఆదరణ, ఆమోదం పొందాలంటే క్షేత్ర స్థాయిలో తిరగడానికి మించి మార్గం లేదని అతను గుర్తించినట్లే ఉంది. వరదలతో కష్టాలు పడుతున్న రైతుల కోసం పొలాల్లో తిరిగాడు. తరచుగా మీడియాతో మాట్లాడుతున్నాడు. ఇంతకుముందులా అక్కడ తడబాటు కనిపించడం లేదు. మామూలు విషయాలు చెప్పడానికే ఇబ్బంది పడ్డ లోకేష్.. ఇప్పుడు వైకాపాపై సూటిగా విమర్శలు చేయగలుగుతున్నాడు. పంచ్‌లు వేస్తున్నాడు.
అన్నింటికీ మించి హైలైట్ ఏంటంటే.. తాజాగా ఒక ప్రెస్ మీట్లో తాను చెప్పాల్సింది అంతా చెప్పేశాక మీడియావాళ్లు ప్రశ్నలు వేయమని ఒకటికి రెండుసార్లు తనే రెట్టించి అడిగాడు. ‘‘నేను జగన్ లాగా పారిపోను. ప్రశ్నలేయండి’’ అంటూ ఏపీ సీఎంకు గట్టి పంచే వేశాడు లోకేష్. చంద్రబాబు వారసుడిలో ఈ మార్పు తెలుగుదేశం వర్గాల్లో ఉత్సాహం నింపుతుందనడంలో సందేహం లేదు.