ఏపీలో విపక్షం వైసీపీకి మంగళవారం ఓ భారీ ఎదురు దెబ్బ తగిలింది. పార్టీకి మంచి పట్టు ఉన్న ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో దాదాపుగా పార్టీ ఖాళీ అయిపోయింది. ఒంగోలు నగర పాలక సంస్థలో వైసీపీ కార్పొరేటర్లుగా ఉన్న వారిలో ఏకంగా 20 మంది సోమవారం రాత్రి జనసేనలో చేరిపోయారు. ఇటీవలే జనసేనలో చేరిపోయిన జగన్ సమీప బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వీరంతా పవన్ కల్యాణ్ చేత జనసేన కండువాలు కప్పించుకున్నారు. ఈ చేరికలతో ఒంగోలులో ఇక వైసీపీ ఖాళీ అయిపోయినట్టేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
ఒంగోలు కార్పొరేషన్ కు 2021లో ఎన్నికలు జరగగా… నాడు అధికార పార్టీగా ఉన్న వైసీపీ ఏకంగా 41 సీట్లను గెలుచుకుంది. టీడీపీకి 6 సీట్లు దక్కగా… ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. ఓ స్థానాన్ని జనసేన గెలిచింది. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురు కావడం.. టీడీపీ, జనసేన, బీజేపీల ఆధ్వర్యంలోని కూటమికి రికార్డు మెజారిటీ దక్కడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. జగన్ మామ బాలినేని స్వయంగా వైసీపీకి రాజీనామా చేసి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిపోయారు. ఆ తర్వాత వైసీపీకి చెందిన 19 మంది వైసీపీ కార్పొరేటర్లను ఆయన జనసేనలోకి తీసుకెళ్లిపోయారు. పలితంగా టీడీపీకి మద్దతు పలికిన వీరంతా చర్మన్ పదవితో పాటు వైస్ చైర్మన్ పదవిని టీడీపీ ఖాతాలో వేసేశారు.
తాజాగా వైసీపీలోనే కొనసాగుతున్న 22 మంది కార్పొరేటర్లలో 20 మంది బాలినేని వెంట నడిచేందుకు సిద్ధపడ్డారు. ఇదే విషయాన్ని ఇటీవలే పవన్ వద్ద ప్రస్తావించిన బాలినేని…ఫిబ్రవరిలోనే ఒంగోలు వస్తే గ్రాండ్ గా బహిరంగ సభ ఏర్పాటు చేసి 20 మంది కార్పొరేటర్లను పార్టీలో చేర్చుకుందామని ప్రతిపాదించారు. అయితే పవన్ అనారోగ్యం, ఇతరత్రా షెడ్యూల్ కారణంగా పవన్ ఒంగోలు టూర్ కు వెళ్లలేకపోయారు. ఇంకెంత కాలం ఆగాలంటూ కార్పొరేటర్లు అడగడంతో బాలినేని ప్లాన్ మార్చేశారు. 20 మంది కార్పొరేటర్లను తీసుకుని పవన్ వద్దకే వెళ్లిపోయారు. అలా మంగళగిరికి వచ్చిన కార్పొరేటర్లు అందరికీ స్వయంగా కండువాలు కప్పిన పవన్.. అందరినీ సాదరగంగా జనసేనలోకి ఆహ్వానించారు. వెరసి ఇప్పుడు ఒంగోలు వైసీపీ కాస్తా… ఒంగోలు జనసేనగా మారిపోయింది.