15 ఏళ్ల పాటు ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం: పవన్

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ నేతలు, వైసీపీ అనుకూల మీడియా, వైసీపీ సోషల్ మీడియా ఒకటే దుష్ప్రచారం పదేపదే చేస్తున్నాయని టీడీపీ, జనసేన నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టి కూటమిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు 9 నెలలుగా కొనసాగుతూనే ఉన్నాయని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వ ఐక్యతపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్ని ఇబ్బందులు వచ్చినా 15 ఏళ్ల పాటు ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటుందని పవన్ అన్నారు. సంకీర్ణ ప్రభుత్వం సవాళ్లతో కూడుకున్నదని, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం తాము కలిసికట్టుగా నిలబడి ఉన్నామని పవన్ అన్నారు. తాము కలిసి లేకుంటే ప్రజలకు ద్రోహం చేసినట్లేనని పవన్ చెప్పారు. కొందరు వ్యక్తులు కావాలని తమను అగౌరవపరిచేలా మాట్లాడుతున్నారని, అయినా సరే తాము కలిసే ఉంటామని అన్నారు.

గవర్నర్ గారి ప్రసంగానికి అడ్డు తగిలి ఆయనకు గౌరవం ఇవ్వని వైసీపీ ఈ సభలో మరోసారి అడుగు పెట్టకూడదని, ఆ పార్టీ రాబోయే ఎన్నికల్లో గెలవకూడదని ఆకాంక్షించారు. కూటమి పార్టీల సభ్యులు సభలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జ్వరంతో బాధపడుతున్నప్పటకీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించేందుకు వచ్చారని, అటువంటి వ్యక్తిని వైసీపీ సభ్యులు అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్రా ప్రజల దురదృష్టమో, దౌర్భాగ్యమోగానీ ఏపీలో కులాల భావన తప్ప..ఆంధ్రులం అనే భావన లేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, తెలంగాణ ప్రజలతో పోలిస్తే ఆంధ్రా ప్రజలకు ప్రాంతీయ భావం తక్కువని పవన్ చెప్పారు. ఆంధ్రా ప్రజలకు తాము ఆంధ్రులం అనే భావన తక్కువ అని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో మినహాయిస్తే ఆంధ్రా ప్రజలకు ఆ భావం ఉన్న సందర్భాలు తక్కువగా కనిపిస్తాయని పవన్ చెప్పారు. కానీ, తెలంగాణ ప్రజలకు తాము తెలంగాణ వాళ్లం అనే భావన ఎక్కువగా ఉంటుందని పవన్ అభిప్రాయపడ్డారు.