ఏపీలోని చిన్నారుల తల్లులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘తల్లికి వందనం’ పథకంపై సీఎం చంద్ర బాబు ఏపీ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై స్పందించిన సీఎం చంద్రబాబు.. ఐదు సంవత్సరాలుగా భ్రష్టు పట్టిపోయిన వ్యవస్థలను, వైసీపీ హయాం లో నిర్వీర్యం అయిపోయిన వ్యవస్థలను గాడిలో పెడుతున్నట్టు చెప్పారు. తను నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాయని.. కానీ.. ఇలాంటి ఇబ్బందులను గతంలో ఎప్పుడూ ఎదుర్కోలేదన్నారు.
అప్పట్లోనూ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా.. ఇంత దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ ఎదురు కాలేదని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని చెప్పారు. లెక్కకు మించిన అప్పులు చేసి… కేంద్రం ఇచ్చిన సొమ్మును కూడా కరిగించారని చెప్పారు. గతంలో ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశామ ని.. రాష్ట్రానికి అప్పులు పెరిగిపోయాయని వివరించామన్నారు. అయితే.. ఇప్పటికీ అప్పులు తవ్వుతున్న కొద్దీ బయటపడుతూనే ఉన్నాయన్నారు.
రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేసినందుకే.. సూపర్ సిక్స్ విషయంలో అమలు ఆలస్యమవుతోందన్నా రు. అయినప్పటికీ.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తానని చెప్పారు. ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. “తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు చేస్తాం. అంతేకాదు.. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా ఈ పథకాన్ని అమలు చేస్తాం. మే నెలలో ఈ పథకం డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. కేవలం ఒక్కరికే ఈ పథకం ఇస్తారన్న వాదనను ఆయన తప్పుబట్టారు. తాము ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చామో.. దానికే కట్టుబడతామన్నారు. విధివిధానాలను కూడా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. వైసీపీ మాదిరిగా తాము ముందు ఒకటి చెప్పి.. తర్వాత.. అప్పట్లో మాకు అర్ధం కాలేదు.. అని దొంగమాటలు చెప్పబోమన్నారు. అదేవిధంగా రైతులను కూడా ఆదుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రైతు భరోసా చెప్పినట్లుగా చేస్తామని సీఎం సభలో ప్రకటించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates