ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ నలుగురి ఓట్లు ఎలా..?

ఏపీలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీల ఎన్నికల ప్రచారం ముగిసిపోయింది. గురువారం ఉదయం ఈ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ జరగనుంది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లంతా ఉపాధ్యాయులే కావడంతో అదేమంత సాధారణ జనానికి పెద్దగా సంబంధం లేని వ్యవహారమే. అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు (డిగ్రీ పూర్తి చేసిన వారు) తమ ఓటు హక్కు వినియోంచుకుంటారు. అయితే ఈ గ్రాడ్యుయేట్లు కూడా తమకు ఎక్కడ ఓటు హక్కు ఉంటే అక్కడే వినియోగించుకోవాల్సి ఉంటుంది. సరే.. ఇప్పుడు ఏపీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా స్థానం ఒకటి కాగా… ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాలకు చెందిన స్థానం మరొకటి.

ఈ లెక్కన రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు మంగళగిరి పరిధిలోనే నివాసం ఉంటున్నారు కదా. వారిలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు.. ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్ లు ఉండవల్లి పరిధిలో ఉంటున్నారు. వారిద్దరికీ అక్కడే ఓటు హక్కు ఉంది. చంద్రబాబు ఎంకామ్ చదవగా… లోకేశ్ కూడా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఈ లెక్కన వీరిద్దరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన వారి కిందే లెక్క. గురువారం నాటి పోలింగ్ లో వీరిద్దరూ.. తాడేపల్లిలోని గాదె రామయ్య, సీతారావమ్మ మండల పరిషత్ పాఠశాలలో ఏర్పాటు కానున్న పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు.

ఇక అధికార కూటమిలో మరో కీలక పార్టీ అయిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా మంగళగిరి పరిధిలోనే ఉంటున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పవన్ అక్కడే తన ఓటు హక్కు వినియోగించుకున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ చదివింది ఇంటర్ వరకే కావడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు ఓటు హక్కు లేదు. దీంతో ఆయన ఓటు వేయాల్సిన అవసరం లేదు. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా మంగళగిరి పరిధిలోని తాడేపల్లిలోనే ఉంటున్నారు. అయితే ఏళ్ల తరబడి జగన్ ఎక్కడ ఉంటున్నా… తన ఓటు హక్కు మాత్రం తన సొంతూరు పులివెందులలోనే కొనసాగించుకుంటున్నారు. డిగ్రీ పూర్తి చేసిన జగన్ కు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్నా… ఈ ఎన్నికల్లో ఆయనకు ఓటు వేయాల్సిన అవసరం లేదు.