వల్లభనేని వంశీకి ముప్పేట ఉచ్చు

వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి ముప్పేట ఉచ్చు బిగుసుకుంది. విజ‌య‌వాడ స‌బ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని పోలీసులు త‌మ క‌స్ట‌డీకి తీసుకున్నారు. టీడీపీ సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త స‌త్వ‌ర్థ‌న్‌ను కిడ్నాప్ చేసి, బెదిరించిన కేసులో నేరుగా ఆయ‌న‌ను విచారించాల‌న్న పోలీసుల అభ్య‌ర్థ‌న‌ను ప‌రిగ‌ణ‌న‌లో తీసుకున్న న్యాయ‌స్థానం.. మూడు రోజుల పాటు క‌స్ట‌డీకి అనుమ‌తించింది.

దీంత వంశీతో పాటు A7 శ్రీపతి, A8 శివరామకృష్ణ ప్రసాద్ లను కస్టడీలోకి తీసుకున్న విజ‌య‌వాడ పోలీసులు, ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్య పరీక్షల కోసం తీసుకువెళ్లారు. అనంతరం కృష్ణ లంక పోలీస్టేషన్ కు తరలించి.. నేరుగా విచారించ‌నున్నారు. మూడు రోజుల పాటు ఈ ముగ్గురినీ విచారణ చేయనున్న పోలీసులు స‌ద‌రు నివేదిక‌ను కోర్టుకు స‌మ‌ర్పిస్తారు. ఇదిలావుంటే.. మ‌రోవైపు.. గన్నవరం పోలీస్ స్టేషన్ లో మ‌రో కేసు నమోదైంది.

గన్నవరంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో 10 కోట్ల రూపాయ‌ల‌ విలువైన స్థలం కబ్జాపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్ట్ న్యాయవాది సతీమణి సుంకర సీతామహాలక్ష్మి పేరిట ఉన్న స్థలం కబ్జా చేసినట్టు ఫిర్యాదు రావ‌డంతో వ్యవస్థీకృత నేరం క్రింద కేసు నమోదు చేసిన‌ట్టు బాధితురాలు చెప్పారు. ఈ కేసులోనూ వల్లభనేని వంశీ తో పాటు మరో 15 మంది పై ఫిర్యాదు చేసినప్ప‌టికీ.. ప్రాథ‌మికంగా వంశీపై కేసు పెట్టిన‌ట్టు పోలీసులు తెలిపారు.