ప్రతిపక్ష హోదానే ప్రామాణికమా? ఇదీ.. కొన్నాళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న చర్చ. తాజాగా మరోసారి రచ్చకెక్కింది. ప్రతిపక్ష హోదా కోరుతూ.. అసెంబ్లీలో వైసీపీ సభ్యులు చేసిన ఆందోళన, నిరసన వంటివి పెద్ద ఎత్తున మీడియాలో చర్చకు వచ్చాయి. ప్రధానంగా అసెంబ్లీ తొలి రోజే గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలోనే ఆందోళనకు దిగారు. అంతేకాదు.. సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ పరిణామాలు పదేళ్లకు పైగా రాజకీయ చరిత్రను పొగేసుకున్న జగన్‌కు ఎలా ఉన్నా.. జనాల్లో మాత్రం జోక్‌గానే ఉంది.
ఇదే ప్రామాణికమా..
ప్రధాన ప్రతిపక్షం హోదా ఉన్నా.. గతంలో టీడీపీ ఏం చేసింది? అని ప్రశ్నిస్తే.. ఫలితం శూన్యమే. ఎందు కంటే.. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. అప్పటి చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చినా.. సభలో మాట్లాడేందుకు మాత్రం పెద్దగా ఎలాంటి అవకాశం చిక్క లేదు. పైగా అవమానాలు, ఈసడింపులు.. ఎక్కువగా కనిపించాయి. దీంతో టీడీపీ సభ్యులు అవమానాలు ఎదుర్కొన్నారు.
అయినప్పటికీ సభలో కొనసాగారు. సభా మర్యాదను కాపాడారు. ప్రజల సమస్యలు ఎత్తి చూపారు. నినాదాలు చేశారు, హోరెత్తించారు. చివరకు సభలో భైటాయించి.. ఆందోళనకు కూడా దిగారు. కానీ, ఇప్పుడు వైసీపీ మాత్రం 11 మంది సభ్యులతో ప్రధాన ప్రతిపక్షం కోసం డిమాండ్ చేయడం వింతగా ఉందన్న వ్యా ఖ్యలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ముందుగా ప్రజల సమస్యలపై ప్రస్తావిస్తే.. దానంతట అదే ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. ఫలితంగా ఇబ్బందులు లేకుండానే సభలో అవకాశం చిక్కుతుంది.
కానీ, ఆదిశగా వైసీపీ వేస్తున్న అడుగులు ఎక్కడా కనిపించడం లేదు. పైగా.. యాగీ చేయడం ద్వారానే ప్రతిపక్ష హోదా వస్తుందని అనుకున్నా పొరపాటే. మరోవైపు.. పొరుగు రాష్ట్రాల్లో తక్కువ మంది సభ్యులు ఉన్నా.. పదేళ్ల పాటు పాలన చేశామన్న భావన ఉన్నా.. ప్రతిపక్షంలో కూర్చునే సరికి.. వాటిని మరిచి ప్రజల పక్షాన పోరాడుతున్న పార్టీలు కనిపిస్తున్నాయి. దీనిని బట్టి.. జగన్ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రతిపక్ష హోదానే ప్రామాణికంకాదు. ప్రజల తరఫున పోరాటం చేసేందుకు ముందుకు వస్తే.. అదే ప్రధాన ప్రతిపక్షాన్ని మించిన పక్షంగా మారుతుంది. కమ్యూనిస్టుల గొంతు విప్పితే.. ప్రతిపక్షాలు కూడా పనికిరావన్న వాదన ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా జగన్ గుర్తించాల్సి ఉంటుంది.