బాబు రెండు దెబ్బలతో అంతా సెట్

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో పార్టీ నేతలను వదిలిపెట్టేది లేదు… అలాగని ఐఏఎస్ లు, ఐపీఎస్ లు అయితే ఉపేక్షించేది అంతకంటే కూడా లేదని చాలా సందర్భాల్లో చంద్రబాబు చేసి మరీ చూపించారు. తాజాగా చంద్రబాబు అలాంటి కఠిన నిర్ణయాన్నే అనుసరించారు. ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ వ్యవహారాలను రచ్చకీడ్చిన ఇద్దరు ప్రముఖులపై ఒకే తరహా చర్యలను చంద్రబాబు తీసుకున్నారు. అంతేకాకుండా ఈ చర్య ద్వారా గీత దాటితే… పార్టీ నేతలనా, అధికారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించేలా ఓ స్పష్టమైన సంకేతాలను చంద్రబాబు జారీ చేశారు.

గత కొంతకాలంగా ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో చైర్మన్ జీవీ రెడ్డి, అధికారుల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విషయం తన దాకా రాగానే… వెంటనే జీవీ రెడ్డిని పిలిపించుకుని మరీ చంద్రబాబు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ విషయాన్ని రెడ్డి ఎలా అర్థం చేసుకున్నారో తెలియదు గానీ…ఈ పరిణామాన్ని ఆయన అవమానంగానే పరిగణించినట్లున్నారు. ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవితో పాటుగా టీడీపీ పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రెడ్డి రాజీనామా చేశారు. ఈ లేఖ అందగానే జీవీ రెడ్డి రాజీనామాలకు చంద్రబాబు క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమోదం తెలిపారు. అంతటితో జీవీ రెడ్డి విషయానికి చంద్రబాబు ముగింపు పలికారు.

ఆ మరుక్షణమే ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న ఐఏఎస్ అధికారి దినేశ్ కుమార్ వ్యవహారాన్ని ఆయన చేతికి అందుకున్నారు. ఒకే ఒక్క నిర్ణయంతో దినేశ్ కుమార్ నిర్వహణలోని అన్ని సంస్థలకు విముక్తి కల్పించారు. ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండీతో పాటుగా రియల్ టైమ్ గవర్నెన్స్ కు సీఈఓగా, గ్యాస్, డ్రోన్ కార్పొరేషన్లకు ఎండీగానూ కొనసాగుతున్న దినేశ్ కుమార్ ను అన్ని పోస్టుల నుంచి రిలీవ్ చేసి పారేశారు. అంతేకాకుండా తక్షణమే జీఏడీలో రిపోర్ట్ చేయాలని దినేశ్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యతో ఫైబర్ నెట్ వివాదానికి చంద్రబాబు సమగ్రంగా ముగింపు పలికినట్లు అయ్యింది. రెడ్డి రాజీనామాలకు ఆమోదం, దినేశ్ పై బదిలీ వేటుతో క్రమశిక్షణ తప్పితే పరిస్థితి ఇలాగే ఉంటుందని పార్టీ నేతలు, అధికారులకు చంద్రబాబు చెప్పకనే చెప్పారన్న వాదనలు వినిపిస్తున్నాయి.