పవన్ పై అంబటి రాంబాబు సెటైర్లు!

ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కావాలని నినాదాలు చేస్తూ నేటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, సభ నుంచి వాకౌట్ చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన వైసీపీ నేతలు తమకు ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆ వ్యాఖ్యలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు.

ఓట్ల శాతం ప్రకారం జగన్ కు ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీకి వెళ్లాలని పవన్ సెటైర్లు వేశారు. ఈ క్రమంలోనే పవన్ కు వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ సీఎం కావాలంటే గోవా వెళ్లాల్సిందే అంటూ అంబటి సెటైర్ వేశారు.

అంతకుముందు, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం, ఇవ్వకపోవడంపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఎన్డీఏ సభాపక్ష నేతను ఎన్నుకోవాలనుకున్నప్పుడు నాయకుడి స్థాయిలో తనను కూర్చోబెట్టారని గుర్తు చేశారు. కానీ, తాను డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఒక రాష్ట్ర మంత్రిని కాబట్టి తన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలోనే ప్రత్యేకంగా తనను కూర్చోబెట్టలేదని అన్నారు.

ఈ రోజు ఉదయం కూడా అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కనిపించారని, ఆయనతోపాటు తనను కూడా తీసుకువెళ్లబోతే తానే ఆగిపోయానని అన్నారు. ప్రోటోకాల్ ప్రకారం సీఎం, స్పీకర్, మండలి ఛైర్మన్ కు మాత్రమే ఆ గౌరవం ఉంటుందని, డిప్యూటీ సీఎంకు ఉండదని చెప్పారు. అదే విధంగా 175 సీట్లలో 11 సీట్లు వచ్చిన వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కదని, అది వారిని అవమానించడం కాదని అన్నారు. వైసీపీ సభ్యులను తాము గౌరవిస్తున్నామని అన్నారు. అసలు, వైసీపీ సభ్యులు సభకు వస్తే ఎంత సమయం ఇస్తారు అన్నది తెలుస్తుందని చెప్పారు. కానీ, సభకు రాకుండా సమయం ఇవ్వరు అని చెప్పడం సరికాదని అన్నారు.