జగన్ ప్లాన్ బూమరాంగ్ అయ్యిందా?

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు శాసన సభకు హాజరై… తన శాసనసభ సభ్యత్వంపై వేలాడుతున్న వేటును తప్పించుకుందామని భావించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహం బెడిసికొట్టిందా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. అటు అసెంబ్లీకి అయినా… ఇటు శాసన మండలికి అయినా సభ్యులుగా ఎన్నికైన వారు వరుసగా 60 రోజుల పాటు సభా సమావేశాలకు హాజరు కాకుంటే వారిపై అనర్హత వేటు తప్పదన్న నిబంధన ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా ఈ నిబంధనను ఎవరూ అంతగా పట్టించుకోకున్నా.. ప్రస్తుతం ఏపీలో అధికార కూటమి ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తోంది. అంతేకాకుండా సభకు రాని వైసీపీ సభ్యులతో పాటుగా ఆ పార్టీ అధినేత జగన్ పైనా అనర్హత వేటు తప్పదంటూ కూటమిలోని కీలక నేతలు. ప్రత్యేకించి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజులు చెబుతూ వస్తున్నారు.

ఈ క్రమంలో అనవసరంగా అనర్హత ముప్పును కొని తెచ్చుకోవడం ఎందుకు అన్న దిశగా ఆలోచించిన జగన్.. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమయ్యే వరకు సభలో ఉన్న వైసీపీ సభ్యులు ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత పార్టీ సభ్యులతో భేటీ అయిన జగన్.. ప్రధాన ప్రతిపక్షం ఇవ్వని సభకు ఇక వెళ్లబోమని తీర్మానం చేశారు. ఇకపై ప్రజల్లోనే ఉంటూ పోరాడదాం అంటూ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. జగన్ నుంచి ఈ ప్రకటన వచ్చేదాకా వేచి చూసిన అధికార పక్షం అసలు విషయాన్ని బయటపెట్టి… జగన్ శిబిరంలో మరోమారు కలకలం రేగేలా చేసింది.

అధికార కూటమి చెబుతున్న దాని ప్రకారం… బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా అటు పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం అయినా… ఇటు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అయినా.. అది సంప్రదాయం (కస్టమరీ) మాత్రమేనని.. దీనికి హాజరయ్యే సభ్యుల హాజరును పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ లెక్కన సోమవారం నాడు సభకు వచ్చిన వైసీపీ సభ్యుల హాజరు పరిగణనలోకి రాదని కూడా ఆ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం నాటి సమావేశాలకు వచ్చి… రిజిష్టర్లలో సంతకం చేస్తేనే.. సభకు హాజరైనట్టు అవుతుందని కూడా చెబుతున్నాయి. ఈ లెక్కన సోమవారం గవర్నర్ ప్రసంగానికి హాజరై అనర్హత వేటు నుంచి తప్పించుకుందామన్న జగన్ ప్లాన్ బూమరాంగ్ అయ్యిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మంగళవారం గనుక సభకు హాజరు కాకపోతే… అనర్హత వేటుకు రంగం సిద్ధం చేసే దిశగా కూటమి అడుగులు వేస్తోంది. మరి కూటమి వేసిన ఈ కొత్త వ్యూహాన్ని జగన్ ఎలా చిత్తు చేస్తారో చూడాలి.