వైసీపీ వినుకొండలో బయటకు వెళ్లేదెవరు…?

ఏపీలో మొన్నటిదాకా అధికార పార్టీగా కొనసాగి… ఇప్పుడు కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఓ వైపు ఓటమి నుంచి పార్టీ అధిష్ఠానం తేరుకోకముందే… కీలక నేతలు వరుసబెట్టి బయటకు వెళ్లిపోయారు. ఇక పార్టీని అంటిపెట్టుకుని సాగుతున్న నేతలను ద్వితీయ శ్రేణి నేతలు మెడబట్టి గెంటేసే యత్నాలు జరుగుతున్నాయి. వాస్తవానికి నేతలంతా బయటకు క్యూ కడుతున్న వేళ… పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలు ఆయా పార్టీల అధినాయకత్వానికి అత్యంత ప్రాధాన్యం కలిగిన నేతలుగా మారిపోతారు. అలాంటి వారిని బయటకు గెంటేస్తారా?.. లేదంటే తామే బయటకు వెళ్లాలా? అంటూ ద్వితీయ శ్రేణి నేతలు వార్నింగులు ఇస్తుంటే.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో అదిష్ఠానం పడిపోయింది.

ఈ తరహా పరిస్థితి ఒక్క వైసీపీకే కాకుండా ఏ పార్టీకి అయినా ఇబ్బందికరమైనదే. అదేదో సామెత చెప్పినట్టుగా… విడవమంటే పాముకు కోపం… కరవమంటే కప్పకు కోపం అన్న చందంగా వైసీపీ పరిస్థితి మారిపోయింది. ఈ తరహా పరిస్థితి ప్రస్తుతం వైసీపీకి మంచి పట్టున్న పల్నాడు జిల్లాలోని వినుకొండలో తలెత్తింది. వినుకొండలో పార్టీ ఓ రేంజిలో బలంగా ఉంది. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగిరింది. జీవీ ఆంజనేయులు ప్రాబల్యానికి చెక్ పెట్టేసిన బొల్లా బ్రహ్మనాయుడు వైసీపీకి విక్టరీని అందించారు. బొల్లా సేవలతో పాటుగా జగన్ జన సునామీ కూడా ఈ విజయానికి కారణంగా నిలిచాయని చెప్పాలి. ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా సాగిన బొల్లా… వినుకొండలో వైసీపీ బలాన్ని ఓ రేంజిలో పెంచారు. అయితే మొన్నటి ఎన్నికల్లో జీవీ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగి బొల్లాను మట్టి కరిపించి… వినుకొండను తిరిగి టీడీపీ ఖాతాలో వేసేశారు. ఓటమిపాలైనా బొల్లా మాత్రం పార్టీని అంటిపెట్టుకుని జగన్ గుడ్ లుక్స్ లో పడిపోయారు.

ఇక్కడిదాక బాగానే ఉన్నా… ఇప్పుడు వైసీపీలో ఓ వర్గం బొల్లా నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బొల్లాను పార్టీ నుంచి సస్పెండ్ చేయించే దిశగా ఆ వర్గం తనదైన దూకుడుతో సాగుతోంది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన ఆ వర్గం బొల్లాపై ఫిర్యాదు చేసింది. వైసీపీ అధికారంలో ఉండగా… సొంత పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న బొల్లా తమపై అక్రమంగా కేసులు పెట్టించారని ఆ వర్గం ఆరోపిస్తోంది. ఇదే విషయాన్ని సజ్జల ముందు పెట్టిన ఆ వర్గం నేతలు.. తక్షణమే బొల్లాను పార్టీ నుంచి సాగనంపాలని దాదాపుగా అల్టిమేటం జారీ చేసింది. అలా జరక్కపోతే… తామే పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపిందట. సజ్జల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో తెలియదు గానీ… ఆదివారం తాడేపల్లి వచ్చిన సదరు వర్గం జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి వద్ద కూడా పంచాయతీ పెట్టిందట. సదరు వర్గాన్ని ఒకింత శాంతపరచిన వైవీ… త్వరలోనే జగన్ దీనిపై దృష్టి సారిస్తారని, అప్పటిదాకా ఓపిక పట్టాలని చెప్పి వారిని పంపించారట. అంటే ప్రస్తుతానికి ఈ విషయం కొంతకాలం ఆగినా…ఎప్పుడో ఒకసారి బ్లాస్ట్ కాక తప్పదన్న మాట వినిపిస్తోంది.