లోకేశ్ ఆటవిడుపు.. టీమిండియా జెర్సీతో న్యూలుక్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆదివారం సరదా సరదాగా గడిపారు. ఓ వైపు పార్టీ వ్యవహారాలు, మరోవైపు ప్రభుత్వ పాలన నేపథ్యంలో క్షణం తీరిక లేకుండా సాగుతున్న లోకేశ్… చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయి కేంద్రంగా జరిగిన దాయాదీ దేశాలు భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ను చూస్తూ ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ టీమిండియా జెర్సీ వేసి మరీ ఎంజాయ్ చేసిన తీరు ఆసక్తి రేకెత్తించింది.

సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. టీడీపీలో అన్నీ తానై సాగుతున్న లోకేశ్… వాస్తవానికి ఇప్పుడు ఫుల్ బిజీ కిందే లెక్క. అయితే ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని ఒత్తిడి ఆహ్వానం మేరకు గతంలోనే లోకేశ్ దుబాయి వెళ్లేందుకు ఒప్పుకున్నట్లుగా సమాచారం. ఆ మేరకే అప్పటికే టూర్ ఏర్పాట్లు అన్ని సిద్ధం అయిపోవడంతో లోకేశ్ దుబాయి వెళ్లక తప్పలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇక లోకేశ్, చిన్నిల వెంట ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన టీడీపీ నేత సానా సతీశ్ కూడా దుబాయి వెళ్లారు. దుబాయి వెళ్లాక వీరితో పుష్ప దర్శకుడు సుకుమార్ జాయిన్ అయ్యారు. వీరిలో లోకేశ్, చిన్నిలు టీమిండియా జెర్సీల్లో కనిపిస్తే… సానా, సుకుమార్ లు సాధారణ దుస్తుల్లోనే కనిపించారు. నలుగురూ కలిసి ఫొటోలుకు ఫోజులివ్వడంతో పాటుగా నలుగురూ ఒకే చోట కూర్చుని మ్యాచ్ ను ఎంజాయ్ చేశారు. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే… ఆదివారం రాత్రే లోకేశ్ అమరావతి తిరిగి రానున్నట్లు సమాచారం.