నరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపి కనుమూరు రఘురామ కృష్ణంరాజు పెద్ద ప్లాన్ లోనే ఉన్నారు. తాను రాజీనామా చేస్తే జరగబోయే ఉపఎన్నికలు ఎలాగుండాలనే విషయంలో మంచి క్లారిటితోనే ఉన్నట్లు అర్ధమవుతోంది. మీడియాతో ఎంపి మాట్లాడుతూ తాను రాజీనామా చేస్తే అమరావతి అంశమే రెఫరెండంగా ఉపఎన్నికలు జరుగుతాయని బల్లగుద్ది చెబుతున్నారు. అపుడు అమరావతిని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు కాబట్టి సిఎం వ్యతిరేక ఓట్లన్నీ తనకు పడతాయనే ఆశతో ఉన్నారు.
అమరావతిలోనే రాజధాని ఉండాలి అనుకునే పార్టీలన్నీ తనకే మద్దతుగా నిలబడాలని రాజుగారు చాలా ఆశపడుతున్నారు. అప్పుడు తాను చాలా ఈజీగా ఉపఎన్నికలను గెలిచేస్తానని అనుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో జనసేన అభ్యర్దిగా పోటి చేసిన నాగుబాబుకు 2 లక్షల ఓట్లొచ్చాయి. అలాగే టీడీపీ అభ్యర్ధకి 4 లక్షల ఓట్లొచ్చినట్లు ఎంపినే చెప్పారు. ఇక వైసీపీ అభ్యర్ధిగా తనకు వచ్చిన ఓట్లలో సుమారు 2 లక్షల ఓట్లు తనకు వ్యక్తిగతంగా వచ్చినవేనట.
తనకొచ్చిన ఓట్లను వైసీపీ తీసేసుకున్నా ఇతర పార్టీలకు పడిన ఓట్లన్నీ తనకు పడితే గెలుపు తనదేనన్న ధీమాతో ఎంపి ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి గెలుపు లెక్కలు ఉంటాయి. అనుకున్న లెక్కలే నిజమైతే అందరూ గెలవాలి. అలా జరగడానికి వీలుండదు కదా. కాబట్టి లెక్కలు వేరు. నిజాలు వేరు. వాస్తవంలోకి ఉపఎన్నికలు ఎప్పుడు జరిగినా తనకు 2 లక్షల ఓట్ల మెజారిటి రావటం ఖాయమని చెప్పుకుంటున్నారు. మరి అవి ఎంతవరకు నిజమవుతాయో తెలియదు.
గత ఎన్నికలను పరిశీలిస్తే… వైసీపీ అభ్యర్ధిగా పోటి చేసిన కృష్ణంరాజుకు 4,47,594 ఓట్లొచ్చాయి. ఇక టీడీపీ అభ్యర్ధి కలువపూడి శివరామ రాజుకు 4,15,685 ఓట్లు వచ్చాయి. అంటే కృష్ణంరాజు గెలిచింది సుమారు 30 వేల ఓట్లతో మాత్రమే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 2014లో ఓడిపోయిన వైసీపీ అభ్యర్దికి 5 లక్షల చిల్లర ఓట్లొచ్చాయి. మొన్నటి ఎన్నికల్లో ఇతర పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలిచిన వైసీపీ అభ్యర్ధులకు సగటున 2 లక్షల మెజారిటి వచ్చింది.
అంతటి వైసీపీ గాలిలో కూడా నరసాపురంలో కృష్ణంరాజుకు వచ్చిన మెజారిటి సుమారు 30 వేలే. జనసేన అధినేత తమ్ముడు నాగబాబు ఎక్కువ ఓట్లు చీల్చడంతో ఇతని మెజారిటీ బాగా తగ్గింది. జనసేన లేకపోతే ఎవరు గెలిచేవారే ఎవరు ఓడేవారే కూడా తెలియని పరిస్థితి అక్కడ. వైసీపీ నేతలు మాత్రం కృష్ణంరాజు కాకుండా వేరే వాళ్లయి ఉంటే ఎక్కువ మెజారిటీ వచ్చేదంటున్నారు.
తాజాగా ఎంపి మాటలు విన్న తర్వాత ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేయాలని ఆయన ఆరాటపడుతున్నారు. అయితే అందుకు ప్రతిపక్షాలు అంగీకరించొద్దా ? ఎందుకంటే చంద్రబాబునాయుడు కారణంగా ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టడానికి బీజేపీ అంగీకరించే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. ఇదే సమయంలో బీజేపీ+జనసేన పార్టీల అభ్యర్ధికి టీడీపీ మద్దతు తీసుకునేది కూడా అనుమానమే. ఇటువంటి పరిస్ధితుల్లో మిత్రపక్షాల తరపున ఓ అభ్యర్ధి ఉంటాడు.
అలాగే టీడీపీ తరపున కూడా ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశాలే ఎక్కువ. ఇదే సమయంలో కాంగ్రెస్ కూడా పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎలా చూసినా నరసాపురంలో బహుముఖి పోటి అనివార్యమనే అర్ధమవుతోంది. మరి వీరందరినీ ఒప్పించి ఉమ్మడి అభ్యర్థిగా రఘురామ కృష్ణ రాజు నిలబడగలిగితే అతని విజయం ఖరారైనట్టే. లేకపోతే… ఆయన మీద ఉన్న కసికి వంద కోట్లయినా ఖర్చుపెట్టి అధికార పార్టీ ఓడించే అవకాశం ఉంది.