తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో రేవంత్ కు కాల్ చేసిన మోదీ… శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ)లో చోటుచేసుకున్న ప్రమాదంపై ఆరా తీశారు. ఎస్ఎల్బీసీలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, భయపడాల్సిన అవసరం ఏమీ లేదని ఆయన రేవంత్ కు భరోసా ఇచ్చారు. ఇందుకోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపనున్నట్లుగా మోదీ చెప్పారు.
శనివారం ఉదయం ఎస్ఎల్బీసీ సొరంగంలో ఉన్నట్లుండి పైకప్పు కూలింది. కార్మికులు పని ప్రారంభించే సమయంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో 50 మందికి పైగానే కార్మికులు ఉన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో 14వ కిలో మీటర్ వద్ద సొరంగం పైకప్పు కూలిపోయింది. దాదాపుగా 3 కిలో మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది. ఈ క్రమంలో సొరంగంలోని రింగులు ఊడిపోవడంతో లోపల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో లోపల చిక్కుబడిపోయిన కార్మికులను బయటకు తీసుకురావడం కష్టంగా మారింది.
అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాదం గురించి తెలిసినంతనే ఘటనాస్థలానికి పరుగులు పెట్టారు. అగ్ని మాపక శాఖ డీజీ కూడా తన సిబ్బందితో కలిసి హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తీసుకువచ్చే పనులు ముమ్మరంగా కొనసాగించారు. చీకటి పడే సమయానికి 42 మంది కూలీలను బయటకు తీసుకురాగా.. వారిలో 13 మంది గాయపడినట్టుగా తెలుస్లోంది. వీరిని హుటాహుటీన సపీమంలోని ఆసుపత్రికి తరలించారు. ఇక సొరంగంలోనే మరో 8 మంది చిక్కుకుపోయారని తేలడం.. అదే సమయంలో చీకటి పడటంతో రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన నెలకొంది.
ఈ ప్రమాదంపై సమాచారం తెలిసినంతనే… ఘటన జరిగిన తీరుపై ప్రధాని ఉన్నతాధికారులతో ఆరా తీశారు. ఆ వెంటనే రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరు… దానిపై తమ ప్రభుత్వం స్పందించిన తీరు…ఇప్పటిదాకా కొనసాగిన చర్యలు, ఇంకా చిక్కుబడిపోయిన కార్మికుల గురించి రేవంత్ ఆయనకు పూసగుచ్చినట్లు వివరించారు. దీంతో భయపడాల్సిందేమీ లేదని… కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు. అంతేకాకుండా అప్పటికప్పుడే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపుతున్నామని, వారి సేవలు వినియోగించుకుని కార్మికులను బయటకు తీసుకురావాలని సూచించారు. ఈ విషయంలో మరే సహకారం కావాలన్నా అడగాలని కూడా రేవంత్ కు మోదీ సూచించారు.