జైలుకెళ్లే టైముంది కానీ.. కోర్టుకు వచ్చే సమయం లేదా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరో వివాదం రేకెత్తింది. తనది కాని కేసుల్లో అరెస్టైన నిందితులను జైలుకు వెళ్లి కలిసేందుకు ఆసక్తి చూపుతున్న జగన్… తన విషయంలో నమోదు అయిన కేసులో కోర్టు విచారణకు హాజరయ్యేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తనపై నమోదు అయిన కేసులను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు ఎంతమాత్రం ఆసక్తి చూపని జగన్.. తన రాజకీయాలకు పనికొస్తుందన్న భావనతో జైలులో ఉన్న తన పార్టీ నేతలను పరామర్శించేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు దళిత సంఘం కన్వీనర్ బూసి వెంకట్రావు ఇవే తరహా ఆరోపణలు చేశారు.

దళిత యువకుడు ముదునూరి సత్యవర్థన్ కిడ్నాప్, ఆపై బెదిరింపుల కేసులో వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఇటీవలే అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో వంశీకి కోర్టు రిమాండ్ విధించగా.. ప్రస్తుతం ఆయన విజయవాడ జైలులో ఉంటున్నారు. ఈ క్రమంలో వంశీని పరామర్శించేందుకు వచ్చిన జగన్.. నేరుగా విజయవాడ జైలుకు వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వంశీపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా విపక్షంలో ఉన్న నేతలను అధికార పక్షం కావాలనే ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన ఆరోపించారు.

ఇదిలా ఉంటే… జగన్ విపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయనపై విశాఖ ఎయిర్ పోర్టులో కోడి కత్తి దాడి జరిగింది. ఈ దాడి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీనివాస్ అనే యువకుడు చాలా రోజులుగా జైలులో ఉండి.. ఆపై కోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు. ఈ కేసు విచారణ ఇప్పటిదాకా ఓ 20 సార్లు జరిగి ఉంటుంది. వీటిలో ఏ ఒక్క విచారణకు కూడా జగన్ హాజరు కాలేదు. తాజాగా శుక్రవారం కూడా ఈ కేసు విచారణ జరగగా… జగన్ గైర్హజరయ్యారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణను కోర్టు మార్చి 21కి వాయిదా వేసింది. జగన్ వరుసబెట్టి ఈ కేసు విచారణకు డుమ్మా కొడుతున్నా.. శ్రీనివాస్ మాత్రం క్రమం తప్పకుండా కోర్టుకు వస్తున్నారు. జగన్ ఈ కేసు విచారణకు హాజరై తన వాంగ్మూలం ఇస్తే.. కేసు ఇట్టే తేలిపోతుంది.

అయినా కూడా జగన్ ఎందుకనో గానీ ఈ కేసు విచారణను అస్సలు పట్టించుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. శ్రీనివాస్ కూడా దళిత యువకుడే. తన కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ కు ఉపశమనం కలిగేలా కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉన్న జగన్.. ఆ విషయాన్ని అంతగా పట్టించుకోవడం లేదని వెంకట్రావు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన ఆరోపణలపై జైలులో ఉన్న వంశీని మాత్రం ఆయన పరామర్శిస్తున్నారని వెంకట్రావు ఆరోపించారు. ఈ లెక్కన దళితులపై జగన్ కు ఉన్న ప్రేమ ఏ పాటిదో ఇట్టే అర్థమవుతోందని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న కేసు విషయంలోనూ జగన్ కోర్టు వాయిదాలకు పలు కారణాలు చెబుతూ ఎగ్గొడుతున్న సంగతి తెలిసిందే.