తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల గణనలో ముస్లింలను బీసీల్లో కలపడంపై ఆమె నిప్పులు చెరిగారు. తాజాగా కరీంనగర్‌లో పర్యటించిన పురందేశ్వరి.. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ మరింత వెనుకబాటుకు గురవుతోందన్నారు. పేదలు, వృద్ధులను కూడా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వంచిస్తోందన్నారు.
కులగణనను తప్పుడు విధానంతో చేశారని పురందేశ్వరి విమర్శించారు. బీసీల్లో ముస్లింలను ఎలా చేరు స్తారన్నారు. ఈ విషయంపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్న ఆమె.. ఈ రూపంలో బిల్లును ఆమో దించడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఇక, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కన్వర్టెడ్ బీసీ అంటూ… రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని వంటి దేశనాయకుడిపై రేవంత్ రెడ్డి అలా వ్యాఖ్యానించి ఉండడం సరికాదన్నారు.
రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీసీలను అవమానపరచడమేనని పురందేశ్వరి చెప్పారు. రాష్ట్రంలో పేదల ఆరోగ్యానికి కూడా ప్రభుత్వం బాధ్యత వహించడం లేదన్నారు. కేంద్రం ఎంతో ఖర్చు పెట్టి అమలు చేస్తున్న ‘ఆయుష్మాన్ భారత్’ పథకం తెలంగాణలో నిర్వీర్యమైందన్నారు. ఇక్కడ అమలు చేస్తే.. ఎంతో మంది ప్రజలకు ఆరోగ్యమేలు జరుగుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అడిగితే.. బీజేపీనేతపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్న ఆమె.. ప్రజల్లో కాంగ్రెస్‌పై రానురాను సానుభూతి కొరవడుతోందని చెప్పారు.