కవితకు ప్రూఫ్ తో కౌంటర్ ఇస్తున్న బీఆర్ఎస్

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో పులుక‌డిగిన ముత్యంలా తిరిగి వ‌స్తానంటూ.. క‌విత చేసిన వ్యాఖ్య‌లు.. ద‌రిమిలా ఢిల్లీ కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇవ్వ‌డం వంటివి తెలిసిందే. అయితే.. మ‌ద్యం కేసుకు-బీఆర్ ఎస్ 2023 ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం కావ‌డానికి ముడిపెట్టిన బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌.. పై క‌విత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న వ‌ల్ల పార్టీ ఎలా ఓడిపోయిందో చెప్పాలంటూ లెక్క‌లు చెప్పాల‌ని ప్ర‌శ్నించారు. దీంతో క‌విత వ్యాఖ్య‌లు బీఆర్ఎస్‌లో చ‌ర్చ‌కు దారితీశాయి.

దీంతో ఆ వెంట‌నే బీఆర్ఎస్ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆనాడు ఏం జ‌రిగిందో వివ‌రిస్తూ.. రీల్స్ స‌హా వీడియోలు పోస్టు చేశారు. వంద‌లాది రీల్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఆనాడు క‌విత అరెస్టు స‌మ‌యంలో మంత్రిగా ఉన్న కేటీఆర్‌, హ‌రీష్‌రావులు.. ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఆందోళ‌న చేయ‌డం.. క‌విత జైల్లో ఉన్న‌ప్పుడు.. ఆమెను క‌లుసుకునేందుకు గంట‌ల కొద్దీ వెయిట్ చేయ‌డం.. వంటి వీడియోలు సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తున్నాయి.

వీటితో పాటు బీఆర్ఎస్ అధినేత‌, అప్ప‌టి సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడిన బైట్లు కూడా ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. క‌విత‌పై అక్ర‌మంగా కేసులు బ‌నాయించార‌ని.. త‌న‌పై ఉన్న అక్క‌సుతోనే త‌న కుమార్తెపై క‌సి తీర్చుకుంటున్నార‌ని కేసీఆర్ అప్ప‌ట్లో వ్యాఖ్యానించారు. అదేవిధంగా మోడీకి ఇద్ద‌రే శ‌త్రువులు ఉన్నార‌ని.. వారిలో ఒక‌రు ఢిల్లీసీఎం(అప్పటి) కేజ్రీవాల్ కాగా.. రెండు తానేన‌ని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టార‌ని.. కానీ త‌న‌ను పెట్ట‌లేక‌.. త‌న కుమార్తెను జైల్లో పెట్టార‌ని ఆయ‌న అప్ప‌ట్లో వ్యాఖ్యానించారు.

అలాగే.. త‌న ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర‌లు చేయ‌గా.. తాను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నాన ని.. ఈ క‌సితోనే.. క‌విత ను జైల్లో పెట్టార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. క‌విత నిర్దోషిగా బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని కేసీఆర్ అప్ప‌ట్లోనే వ్యాఖ్యానించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వైర‌ల్ అవుతోంది. అయితే.. ఇవ‌న్నీ.. ఇప్పుడు బీజేపీకి సంబంధించి ఇచ్చిన కౌంట‌ర్లు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. కేవ‌లం క‌విత‌కు కౌంట‌ర్ ఇచ్చేందుకు.. బీఆర్ ఎస్ నాటి `గుర్తుల‌ను` గుర్తు చేస్తుండ‌డం విశేషం. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన ప‌రిశీల‌కులు.. బీఆర్ ఎస్‌లో క‌విత ఫీవ‌ర్ క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.