
కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలోని వేట్లపాలెంలో సంభవించిన భారీ పేలుడు ఘటన రాష్ట్రం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. శనివారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య జరిగిన ఈ విస్ఫోటనంలో తొలుత నలుగురు మృతి చెందినట్లు వార్తలు వచ్చినా, ఆ సంఖ్య సాయంత్రానికి 24 మందికి చేరింది. పది సంఖ్యలో బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు స్పందించారు. విజయనగరంలో పర్యటనలో ఉన్న ఆయన షెడ్యూల్ ప్రకారం సాయంత్రం వరకు అక్కడే ఉండాల్సి ఉంది. అయితే ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే తన విజయనగరం పర్యటనను ముగించుకుని కాకినాడకు బయలుదేరారు.
సాయంత్రం 6.30 గంటల సమయంలో ఆయన రోడ్డు మార్గంలో కాకినాడకు చేరుకుని అక్కడి నుంచి బాధిత ప్రాంతానికి వెళ్లారు. ఘటన స్థలిని కాలినడకన పరిశీలించిన చంద్రబాబు పేలుడు ఎలా సంభవించిందన్న విషయంపై కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. అలాగే అక్కడ చేపట్టిన సహాయక చర్యలపై అధికారులను ప్రశ్నించారు.
ఫ్లడ్ లైట్ల వెలుగులో..
సాయంత్రం 6.30 గంటలకు ఘటన ప్రాంతానికి చేరుకున్నప్పటికీ ఆ ప్రాంతం పొలాల మధ్య ఉండడం, విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో పర్యటన చీకటిలోనే సాగింది. అధికారులు వెంటనే ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు. ఆ వెలుగులోనే చంద్రబాబు ప్రతి మూలను పరిశీలించారు. కుప్పకూలిపోయిన షెడ్లు, కాలిపోయిన వాహనాలను పరిశీలించారు. చంద్రబాబు వెంట మంత్రి అనిత, బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ కూడా పాల్గొన్నారు.
ఆదుకుంటాం: పవన్
బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ఘటన ఎంతో కలచివేసిందని అన్నారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ఈ విషాద ఘటన అనేక కుటుంబాల్లో తీవ్ర దుఃఖాన్ని నింపిందని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. పార్టీ తరఫున జనసైనికులు అవసరమైన సహాయం అందించాలని ఆయన సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates