కేసీఆర్ అమెరికా టూర్ పక్కా… ఎన్నెన్ని విశేషాలో..?

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు త్వరలోనే అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు కేసీఆర్ ఆమెరికా పర్యటనపై బుధవారం ఓ క్లారిటీ అయితే వచ్చింది. విదేశీ పర్యటనలు అంటే అంతగా ఆసక్తి చూపని కేసీఆర్.. తన మనవడు, మనవరాళ్ల కోసం ఇప్పుడు అమెరికా ఫ్లైట్ ఎక్కబోతున్నారు. కేటీఆర్ కుమార్తె అలేఖ్యకు ఇటీవలే అమెరికాలో చదివేందుకు సీటు వచ్చిందట. ఆమెను కళాశాలలో చేర్పించేందుకు కేసీఆర్ అమెరికా వెళుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కేటీఆర్ కుమారుడు హిమాన్షు కూడా ఇదివరకు అమెరికాలోనే చదివే వారు. అయితే పలు కారణాలతో ఆయన విద్యాభ్యాసం అమెరికా నుంచి సింగపూర్ కు మారిందట. ఈ క్రమంలో కొన్నాళ్లు అమెరికాలో ఉండనున్న కేసీఆర్ మరికొన్నాళ్లు సింగపూర్ లో ఉంటారని సమాచారం.

ఇక కేసీఆర్ విదేశీ పర్యటన అంటే లెక్కలేనన్ని విశేషాలు ఉన్నాయని చెప్పక తప్పదు. సుదీర్ఘ కాలం పాటుగా రాజకీయాల్లో కొనసాగుతున్న కేసీఆర్… పదేళ్ల పాటు సీఎంగా, కొంత కాలం పాటు కేంద్ర మంత్రిగా, ఉమ్మడి రాష్ట్రంలో కొంతకాలం పాటు మంత్రిగా, మరికొంత కాలం పాటు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా కేసీఆర్ సుదీర్ఘ కాలమే కొనసాగారు. సీఎం వంటి కీలక పదవిలో ఉన్నా… విదేశీ పర్యటనలు అంటూ కేసీఆర్ ఏనాడూ హడావిడి చేసింది లేదు. పెట్టుబడులు రాబట్టేందుకు అంటూ ఆయన దావోస్, అమెరికా వంటి టూర్లకు అసలే వెళ్లలేదు. కేసీఆర్ తన లైఫ్ లోనే ఇప్పటిదాకా కేవలం రెండంటే రెండు సార్లు మాత్రమే విదేశీ యానం చేశారు. ఆ రెండు టూర్లలో ఓ సారి సింగపూర్ వెళ్లిన కేసీఆర్…మరో టూర్ లో చైనాకు వెళ్లి వచ్చారు.

ఇక కేసీఆర్ కు ఉన్న ఇద్దరు పిల్లలు కేటీఆర్, కవితలు అమెరికాలోనే విద్యనభ్యసించిన సంగతి తెలిసిందే. కేటీఆర్ అయితే అమెరికాలో విద్యాభ్యాసం తర్వాత అక్కడే కొంతకాలం పాటు ఉద్యోగం కూడా చేశారు. చాలా ఏళ్ల పాటే కేటీఆర్ అమెరికాలో ఉన్నారు. అయితే పిల్లల చదువు అని, ఉద్యోగాల్లో ఉన్న వారి బాగోగుల కోసమని ఏనాడూ కేసీఆర్ అమెరికా పర్యటనకే వెళ్లకపోవడం గమనార్హం. కారణమేమిటో తెలియదు గానీ.. విదేశీ పర్యటనలు అంటే కేసీఆర్ కు అస్సలు ఆసక్తే ఉండదు. ఇప్పటి నేతలు చిన్న మంత్రి పదవో, లేదంటో ఎమ్మెల్యే పదవో దక్కితేనే విదేశీ టూర్లంటూ బడాయి పడుతున్న రోజులివి. అయితే కేసీఆర్ మాత్రం ఫారిన్ టూర్ల మాటే ఎత్తకుండా ఉండటం గమనార్హం.

ఇక బుధవారం చాలా రోజుల తర్వాత తన ఎర్రవలి ఫామ్ హౌస్ ను వీడి హైదరాబాద్ వచ్చిన కేసీఆర్ నేరుగా… సికింద్రాబాద్ లోని రీజనల్ పాస్ పోర్టు ఆఫీస్ కు వెళ్లారు. సీఎంగా ఉండగా… తనకు ప్రభుత్వం నుంచి అందిన డిప్లొమాటిక్ పాస్ పోర్టును ఆయన అధికారులకు సరెండర్ చేశారు. ఆ తర్వాత తన సాధారణ పాస్ పోర్టును రెన్యూవల్ చేయించుకున్నారు. తన పాస్ పోర్టుతో పాటు తన సతీమణి శోభ పాస్ పోర్టును కూడా ఆయన రెన్యూవల్ చేయించారు. దీంతో అటు అమెరికాతో పాటు ఇటు సింగపూర్ కు కూడా ఆయన సతీసమేతంగానే వెళ్లనున్నట్లు సమాచారం. ఈ టూర్ లో అమెరికాలో ఓ నెల, సింగపూర్ లో మరో నెల పాటు కేసీఆర్ దంపతులు ఉండే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.