ప్రచారం మంచిదే! ఏ పార్టీకైనా.. ఏ నాయకుడికైనా కావాల్సిందే. అసలు రాజకీయాల్లోకి వచ్చేది కూడా ప్రచారం కోసమే. అవసరమైతే.. డబ్బులు ఇచ్చి మరీ ప్రచారం చేయించుకుంటున్న పరిస్థితి కనిపిస్తూనే ఉంది. అలాంటి ప్రచారం మంచిదే అయినప్పటికీ.. ఇది.. అతిగా మారితే.. మాత్రం కొంపలు ముంచేయడం ఖాయం. అనుకూల ప్రచారమే అయినా.. శ్రుతి మించితే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఇలాంటి పరిస్థితి టీడీపీలో కనిపిస్తుండడంపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి ప్రచారం వద్దు! అని చెబుతున్నా.. పరిస్థితులు మాత్రం ఆగడం లేదు. ఎవరూ ఆయన మాటలు లెక్క చేయడం లేదని తెలుస్తోంది. మొత్తంగా విషయంలోకి వెళ్తే.. ఇటీవల పార్టీలో కమిటీలను వేశారు. పార్లమెంటరీ జిల్లా కమిటీలకు ఇంచార్జ్‌లను నియమించారు. అదేవిధంగా.. రాష్ట్ర కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. పొలిట్ బ్యూరోను ప్రక్షాళన చేశారు. అనేక మందికి పదవులు ఇచ్చారు. వద్దనుకున్న వారికి, విశ్రాంతి తీసుకునేందుకు సిద్ధమైన వారికి కూడా చంద్రబాబు అవకాశం ఇచ్చారు. దీంతో తమ్ముళ్లలో ఓ వర్గం ఖుషీగా ఉంది.
అదేసమయంలో పదవుల కోసం ఎదురు చూసిన వర్గంలో మాత్రం ఒకింత నిరాశ, నిస్పృహ వ్యక్తమవుతు న్నాయి. నిజానికి ఇలాంటి అసంతృప్తులు అన్ని పార్టీల్లోనూ ఉండేవే! పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికీ పదవులు అంటే సాధ్యం కాదు. సో.. కొన్నాళ్లు ఆగితే.. అసంతృప్తులు అవే సర్దుకుంటాయని అందరూ అనుకుంటారు. అయితే, చిత్రంగా ఇప్పుడు టీడీపీలో ప్రచార పర్వం ఊపందుకుంది. పదవులు పొందిన నేతలను ప్రసన్నం చేసుకునేందుకు వారి అనుచరులు కొందరు స్థానిక మీడియా, పత్రికల్లో ప్రకటనలు గుప్పిస్తున్నారు.
పెయిడ్ ఆర్టికల్స్ కూడా రాయించుకుంటున్నారు. మంచిదే వారి నాయకులను వారు పొగుడుకున్నా.. వారు ప్రచారం చేసుకున్నా.. తప్పులేదు. అయితే.. ఇక్కడ భారీ ట్విస్ట్ కనిపిస్తోంది. అదేంటంటే.. పదవులు పొందిన తమ నేతలను పొగడ్తలతో ముంచెత్తున్న కిందిస్థాయి అనుచరులు.. విధేయతకు పట్టం కట్టారు
. నమ్ముకున్న వారికి న్యాయం చేశారు.
బాబు మెచ్చి ఇచ్చిన పదవి!
.. ప్రజల మనిషికి మంచి గుర్తింపు
.. వంటి టైటిల్స్‌తో ప్రచారాలను హోరెత్తించారు. దీంతో పదవులు దక్కని సీనియర్లు, కొందరు ఆశావహులు కూడా ఈ ప్రచార హోరుపై ఫైర్ అవుతున్నారు.
ఇన్నాళ్లు పార్టీలో ఉన్న మేం మాత్రం నమ్మకంగా పనిచేయలేదా? అంటూ.. ఏకంగా పార్టీకి లేఖలు పంపుతున్నారు. దీంతో ఇది వివాదంగా మారే అవకాశం కనిపిస్తోందనిఅంటున్నారు పరిశీలకులు. ఇదే విషయంపై చంద్రబాబు కూడా స్పందించారని, ప్రచార ఆర్భాటాలు వద్దని వారించినా.. ఆయన మాటను ఎవరూ లెక్క చేయడం లేదని అంటున్నారు. మొత్తానికి టీడీపీలో సరికొత్త ప్రచార యుద్ధం జరుగుతోందని తెలుస్తోంది.