వైసీపీ నాయకులు, కార్యకర్తల మాట వింటామని.. జగన్ 2.0లో వారికే ప్రధానంగా ప్రాధాన్యం ఇస్తామని మాజీ సీఎం జగన్ తరచుగా చెబుతున్నారు. ఆ మాట చెప్పగానే.. పలు జిల్లాల నుంచి నాయకులు తాడేపల్లి ప్యాలస్‌కు క్యూ కడుతున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లుగా ఉన్నవారిని మార్పు చేయాలని వారు కోరుతున్నారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు గత ఏడాది కూడా.. అనేక మంది నాయకులు ఇవే డిమాండ్లను తెరమీదికి తెచ్చారు.
నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల(అప్పటి) పెత్తనం ఎక్కువైందని.. తాము వేగలేక పోతున్నామని వారు తెలి పారు. అలాంటి వారికి టికెట్ ఇవ్వద్దని, వారిని ప్రోత్సహించద్దని కూడా చెప్పారు. ఇసుక, మద్యం, భూముల విషయంలో వారు చేస్తున్న అవినీతిని కూడా వైసీపీ క్షేత్రస్థాయి నాయకులు అధినేత ముందు పెట్టారు. కానీ, అప్పట్లో వారి మాటలను లైట్ తీసుకున్న జగన్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులకే అవకాశం ఇచ్చారు. ఈ ప్రభావం పార్టీలో చీలికలు తెచ్చింది.
ఫలితంగా వైసీపీ కంచుకోటలుగా ఉన్న మాచర్ల వంటి నియోజకవర్గాల్లోనూ సైకిల్ దూసుకుపోయింది. ఇప్పుడు మీ మాటే వింటానని జగన్ చెప్పడంతో ఆయా నియోజకవర్గాల నాయకులు తాడేపల్లికి వచ్చి మరోసారి అక్కడి నేతలపై ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. ఇలాంటి వారిని తొలగించాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలే.. ఆయా నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లుగా ఉన్నారు. ఇలాంటి వారితో తాము కలిసి ముందుకు నడవలేమని చెబుతున్నారు.
అయితే.. వీరి ఆవేదన ఎలా ఉన్నా. జగన్ సదరు ఇంచార్జ్‌లను మార్చే ప్రయత్నం చేసే అవకాశం లేదు. వారికి.. జగన్ కు ఉన్న బాండింగ్ కావొచ్చు.. సామాజిక వర్గాలపరంగా, ఆర్థికంగా కూడా బలంగా ఉన్న నాయకులు కావొచ్చు. ఏదేమైనా.. ఇతర నాయకులు కోరుతున్నట్టుగా జగన్ చేసే అవకాశం అయితే లేకుండా పోయింది. కానీ, ప్రస్తుతానికి వారి వినతులు మాత్రం తీసుకుంటున్నారు. చివరకు ఏం చేస్తారో చూడాలి.