ఆ ఊహాగానాలకు పవన్ మార్కు రిప్లై ఇది!

గత కొన్ని రోజులుగా ప్రభుత్వ పాలనకు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దూరంగా ఉన్నారు. ఓ కేబినెట్ సమావేశంతో పాటు మరో కీలక సమావేశానికి ఆయన హాజరు కాలేదు. అంతేకాకుండా ఇటీవల చేపట్టిన ధర్మ పరిరక్షణ యాత్రకు ఆయన హైదరాబాద్ నుంచే బయలుదేరారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఫోన్ చేసినా పవన్ నుంచి స్పందన రావడం లేదని వైసీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. అయితే వాటిపై పవన్ పెద్దగా స్పందించలేదు. టీడీపీ నుంచి కూడా మాట కూడా వినిపించలేదు.

తాజాగా ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు హస్తినకు వచ్చిన పవన్ కల్యాణ్… ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు బీజేపీ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. విందు అనంతరం అక్కడే మీడియాతో పవన్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన మధ్య విభేదాాలు, చంద్రబాబు ఫోన్ చేసినా తాను స్పందించలేదన్న వార్తలను ప్రస్తావించకుండానే పవన్ ఒకింత గట్టిగానే ఆ ఊహాగానాలపై ఘాటుగా స్పందించారు. ఆ ఊహాగానాలను ఏమాత్రం ప్రస్తావించకుండా పవన్ చేసిన వ్యాఖ్యలు ఇకపై ఆ తరహా ఊహాగానాలు చేయాలంటేనే ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అయినా ఈ సందర్భంగా పవన్ ఏమన్నారంటే… ”గత కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధ పడుతున్నాను. ఇప్పటికీ వెన్ను నొప్పి తీవ్రంగా వేధిస్తోది. ఈ కారణంగానే ఇటీవల కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కాలేకపోయాను. నాకు కేటాయించిన శాఖల బాధ్యతలను త్రికరణ శుద్ధితోనే నిర్వర్తిస్తున్నారు. ఇందులో ఎలాంటి సందేహం కూడా లేదు. జగన్ ఇష్టారాజ్యంగా పరిపాలన సాగించారు. అందుకే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫలితంగా ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అలాంటి రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు శ్రమిస్తున్నాం. ఇందుకు కొంత సమయం అయితే పట్టొచ్చు. అయినా ఫలితం సాధించి తీరతాం” అని పవన్ వ్యాఖ్యానించారు.