దేశ రాజధాని ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చాక… మోదీ అక్కడికి చేరుకున్నారు. వేదికపై ఉన్న ఎన్డీఏ మిత్రపక్షాల అధినేతలకు నమస్కరిస్తూ సాగిన మోదీ… పవన్ వద్దకు వచ్చిన వెంటనే ఆయనకు షేక్ హ్యాండిచ్చారు. ఈ సందర్భంగా పవన్ ధరించిన సనాతన ధర్మ వస్త్రధారణను చూసి ఒకింత ఆసక్తి కనబరచిన మోదీ… పవన్ తో కాసేపు ముచ్చటించారు. మోదీ వ్యాఖ్యలకు బదులిస్తూనే పవన్ పడిపడి నవ్విన దృశ్యం వైరల్ అయ్యింది.
అసలు పవన్ తో మోదీ ఏం మాట్లాడారన్న విషయంపై అందరికీ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో అక్కడి నుంచి వెళ్లిపోతున్న పవన్ ను నేషనల్ మీడియా చుట్టుముట్టింది. మోదీ మీతో ఏం మాట్లాడారు అంటూ పలువురు మీడియా ప్రతినిధులు పవన్ అడిగారు. ఈ సందర్భంగా మోదీతో తన సంభాషణను పవన్ వివరించారు. ”మోదీ గారు నన్ను చూడగానే నవ్వుతూ, ఏంటి అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారా?”. అని అన్నారని పవన్ చెప్పారు. అయితే ”అలాంటిది ఏమీ లేదు” అని పవన్ జవాబిచ్చారు. దానికి ఇంకా చాలా సమయం ఉంది, ముందు ఇవన్నీ చూసుకోవాలి” అని మోదీ పవన్ తో చెప్పారట.
ఇక ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా… పవన్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ” ఇది ఓ చరిత్రాత్మక విజయం. ఈ విజయం మోదీ నాయకత్వ ప్రతిభకు పట్టం కట్టింది. మోదీపై దేశ ప్రజలకు ఉన్న నమ్మకానికి ఈ విజయాన్ని ప్రతీకగా చెప్పాలి. ఢిల్లీలో అధికారం చేజిక్కడం అంటే ఇదో చరిత్రాత్మక విజయంగానే పరిగణించాలి” అని పవన్ చెప్పారు. మొత్తంగా ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి పవన్ వెళ్లడం, ఆయనతో మోదీ ప్రత్యేకంగా మాట్లాడటం, ఆ సందర్భంగా ఏకంగా హిమాలయాల ప్రస్తావన రావడం నిజంగానే అందరినీ సమ్మోహితులను చేసిందని చెప్పాలి.