ఆ రెడ్డిగారి చూపు.. జ‌నసేన వైపు…?

రాజ‌కీయాల్లో మార్పులు స‌హజం. ఏ ఎండ‌కు ఆ గొడుగు.. రాజ‌కీయాల్లోనే సాధ్యం. కాబ‌ట్టి.. ఎంత అభిమానం ఉంద‌ని చెప్పినా.. పార్టీ జెండాతో చొక్క‌కుట్టించుకున్నామ‌ని తిరిగినా.. అవ‌కాశం-అవ‌స‌రం అనే రెండు ప‌ట్టాల‌పైనే రాజ‌కీయ నేత‌ల జీవితాలు న‌డుస్తాయి. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన వారిలో `రెడ్డి` నాయ‌కులు ఎవ‌రూ పెద్ద‌గా లేరు. ఒక‌వేళ ఉన్నా వారికి నియోజ‌క‌వ‌ర్గాల్లో పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. అయితే.. తాజాగా అటు త‌న నియోజ‌క‌వ‌ర్గంలోనూ.. ఇటు జిల్లాలోనూ ముద్ర వేసుకున్న ఓ రెడ్డి నాయ‌కుడు.. పార్టీ మారేందుకు రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది.

ఆయ‌నే నంద్యాల జిల్లాకు చెందిన శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి. గ‌తంలో టీడీపీలో రాజ‌కీయాలు చేసిన శిల్పా సోద‌రులు 2017లో జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక‌లో టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో సైకిల్ దిగేశారు. ఆ వెంట‌నే వైసీపీ గూటికి చేరారు. 2019లో శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి శ్రీశైలం నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ కండువాతో విజ‌యం అందుకున్నారు. మంత్రివ‌ర్గంలో చోటు ఆశించినప్ప‌టికీ.. రెడ్డి ట్యాగ్ అడ్డు ప‌డ‌డంతో మౌనంగా ఉండిపోయారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో అంద‌రిమాదిరిగానే ఈయ‌న కూడా ఓడిపోయారు. అప్ప‌టి నుంచి మౌనంగా ఉంటున్న ఆయ‌న‌.. వైసీపీ అనుస‌రించిన వ్యూహాల‌పై ఒక‌టిరెండు సార్లు విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఇక‌, ఇప్పుడు శిల్పా చ‌క్ర‌పాణి.. పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. చిత్రం ఏంటంటే.. ఈ విష‌యాన్ని టీడీపీ నాయ‌కురాలు, ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ చెప్ప‌డం! శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి జనసేన పార్టీ వైపు చూస్తున్నారని భూమా ఆరోపించారు. ఆ పార్టీలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నారని.. ఆయన ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. జనసేనలో చేరే ప్రయత్నాలు చేయడం లేదని శిల్పా చక్రపాణి రెడ్డి చెప్పగలరా అని కూడా భూమా ప్రశ్నించ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఆయ‌న చేసుకుంటే.. ఎవ‌రికీ ఇబ్బంది లేద‌ని.. కానీ, త‌నపై ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాద‌న్నారు.

శిల్పా చక్రపాణి రెడ్డి అధికారం లేకపోతే తమ పనులు సాగవని తెలుసుకుని జనసేన పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్న ట్లు అఖిలప్రియ చెప్పారు. ఇదిలావుంటే.. శిల్పా అనుచ‌రులు కూడా.. ఇదే విష‌యాన్ని చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ ప‌ని అయిపోయింద‌ని కొంద‌రు శిల్పా అనుచ‌రులు స్థానికంగా చెబుతున్నారు. అంతేకాదు.. త‌మ‌కు ప్రాధాన్యం ఉండాలంటే.. జ‌న‌సేన‌లో అవ‌కాశం ఉంద‌ని.. వ్యాఖ్యానిస్తున్నారు. రాజ‌కీయాలు ఎవ‌రికీ శాస్వ‌తం కాద‌న్న‌ది కూడా వారు చెబుతున్న మాట‌. సో.. దీనిని బ‌ట్టి శిల్పా చ‌క్ర‌పాణి.. జ‌న‌సేన‌వైపు చూస్తున్నార‌న్న చ‌ర్చ అయితే జోరుగా సాగుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో .. దీనిలో వాస్త‌వం ఎంతుందో చూడాలి.