సీఎం రేవంత్ తాజా నిర్ణయంతో కాసుల కళకళ..

కీలక నిర్ణయాన్ని ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న బొక్కసాన్ని కాసులతో కళకళలాడే నిర్ణయాన్ని వెల్లడించారు. సరైన సమయంలో.. సరైన రీతిలో తీసుకున్న ఈ నిర్ణయం రియల్ రంగానికి కొత్త ఊపును తేవటమేకాదు.. నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న వేలాది ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కలుగుతుంది. దీంతో.. ఓవైపు ఎల్ ఆర్ ఎస్ డబ్బులు.. మరోవైపు రిజిస్ట్రేషన్ ఆదాయం భారీగా పెరగటం ఖాయమని చెప్పాలి.

లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకంలో భాగంగా గడిచిన నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించారు. అంతేకాదు..ఎల్ఆర్ఎస్ ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లుగా ప్రకటించటంతో.. భారీ ఎత్తున దరఖాస్తులు వెల్లువెత్తుతాయనిభావిస్తున్నారు. అంతేకాదు… సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనే నేరుగా క్రమబద్ధీకరణ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్న సూచన ఆసక్తికరంగా మారింది.అయితే.. ఈ పథకానికి మార్చి 31లోపు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఎల్ఆర్ఎస్ ఫీజులో రాయితీ లభిస్తుందని పేర్కొన్నారు.

అంతేకాదు ఎల్ఆర్ఎస్ పథకం అమలును వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేని లే అవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై గతంలో ప్రభుత్వం నిషేధం విధించిందని.. దీంతో వాటిని కొనుగోలు చేసిన వారు ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నాలుగేళ్లుగా రిజిస్ట్రేషన్ కు అవకాశం లేకుండా చేసిన దానికి భిన్నంగా తాజాగా చేసిన ప్రకటన వేలాది మందికి మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఈసారి వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ పెండింగులో ఉన్న వారు మాత్రమే కాదు.. లే అవుట్లలో విక్రయం కాకుండా పెద్ద సంఖ్యలో మిగిలిన ప్లాట్లకు క్రమబద్ధీకరణ పథకం అమలు అయ్యేలా వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ అంశానికి సంబంధించి మరింత స్పష్టత ఇవ్వాలంటే.. ఒక లే అవుట్ లో పది శాతం ప్లాట్లు రిజిస్టర్ అయి.. మిగిలిన 90 శాతం ప్లాట్లు రిజిస్టరు కాకుంటే ఎల్ఆర్ఎస్ కింద వాటిని క్రమబద్ధీకరణతోపాటు రిజిస్ట్రేషన్ అవకాశాన్ని కల్పిస్తారు. ఇప్పటికే ప్లాట్లు కొనుగోలు చేసి.. అమ్మకపు దస్తావేజు కలిగిన వారంతా మార్చి 31 లోపు స్పందిస్తే రుసుములో రాయితీ లభించనుంది. మొత్తంగా ఈ నిర్ణయం ప్రభుత్వానికి భారీ ఎత్తున ఆదాయం లభించేలా చేస్తుందన్న మాట బలంగా వినిపిస్తోంది. రియల్ రంగానికి ఇదో సానుకూల అంశంగా మారుతుందని చెప్పక తప్పదు.