తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల మాటల్లో తేడా రావడం.. పార్టీ నేత లను అయోమయానికి గురి చేసింది. “ఆరు నూరైనా అధికారం మనదే. త్వరలోనే బై పోల్స్ రానున్నాయి“ అని మాజీ సీఎం కేసీఆర్ గట్టిగా చెప్పారు. అంతేకాదు.. పార్టీ తరఫున ప్రజల మద్యకు కూడా వెళ్లాలని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలను, తెలంగాణ ఉద్యమాన్ని, అస్తిత్వాన్ని కూడా ప్రజలకు మరోసారి గుర్తు చేయాలని కేసీఆర్ చెప్పుకొచ్చారు. అంటే.. మొత్తంగా కేసీఆర్ అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే వేదికను రెడీ చేసుకుంటున్నారు.
అయితే.. మరోవైపు.. కేటీఆర్ మాత్రం మాకు అధికారమే పరమావధి కాదు.. అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా బీఆర్ ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. అధికారమే పరమావధి కాదని.. ప్రజల తరఫున పోరాటమే తమ లక్ష్య మని వెల్లడించారు. “అధికారమే పరమావధిగా పనిచేసే ఆలోచన మాకు లేదు“ అని కేటీఆర్ మీడియాకు వెల్లడించారు. ప్రజల తరఫున కొట్లాడుతామని చెప్పారు. ప్రజా ఉద్యమాలు తమకు కొత్తకాదని.. గతంలోనూ ఇప్పుడు కూడా ఉద్యమాలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని చెప్పారు.
“తెలంగాణ అస్తిత్వం, ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం. బీఆర్ఎస్ రజతోత్సవాలను ఏడాది పాటు నిర్వహించాలని మా నాయకుడు చెప్పారు. ఈ మేరకు జిల్లాల వారిగా ఈ కార్యక్రమాలను ఎలా నిర్వహించాలన్న విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఉత్సవాల నిర్వహణకు సీనియర్ నేతల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేస్తాం“ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే.. అటు కేసీఆర్.. అధికారం పై సంచలన వ్యాఖ్యలు చేస్తే.. ఇటు కేటీఆర్ మాత్రం పోరాటాలు, ఉద్యమాలు అని కామెంట్లు చేయడం.. అధికారమే పరమావధి కాదని చెప్పడంపై బీఆర్ ఎస్ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.
ఏంటి వ్యూహం?
కేసీఆర్ అయినా.. కేటీఆర్ అయినా.. అధికారం వస్తుందంటే కాదంటారా? అధికారం కోసం రాజకీయాల్లో లేరంటారా? అనేది ప్రశ్న. ఇలా చూసుకుంటే.. అధికారం కోసమే ఎవరైనా పాకులాడుతారు. అయితే.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో కొంత తీవ్రత ఎక్కువగా ధ్వనించిన నేపథ్యంలో కేటీఆర్ దానిని సమం చేసేందుకు ప్రయత్నించారు అంతే! “మేమే అధికారంలోకి వస్తున్నాం. 100 శాతం మాదే అధికారం“ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.. విమర్శలకు గురయ్యే అవకాశం ఉందని గుర్తించిన కేటీఆర్.. తనదైన శైలిలో .. ప్రజల తరఫున కొట్లాడుతాం! అని వ్యాఖ్యానించి సమం చేసే ప్రయత్నం చేయడం గమనార్హం.