వంశీతో జగన్ ములాఖాత్ పై టీడీపీ రియాక్షన్

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, ఫిర్యాదుదారుడిపై బెదిరింపుల కేసులు వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో వంశీని పరామర్శించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నేరుగా విజయవాడ జైలుకు వెళ్లారు. జైలులో వంశీని పరామర్శించిన జగన్… ఆ తర్వాత బయటకు వచ్చి వంశీని అన్యాయంగా అరెస్టు చేశారంటూ కూటమి సర్కారుపై ఆరోపణలు గుప్పించారు. వంశీతో ములాఖత్ ను ముగించుకుని జగన్ అటు వెళ్లారో, లేదో… టీడీపీ ఆయనపై విరుచుకుపడింది. అక్రమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన వంశీని ఎలా పరామర్శిస్తారని జగన్ ను టీడీపీ నిలదీసింది. ఈ మేరకు జగన్ కు 10 ప్రశ్నలతో కూడిన లేఖాస్త్రాన్ని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సంధించారు.

ఈ లేఖలో పల్లా… వంశీ చేసిన అక్రమాలను ఏకరువు పెట్టారు. దళిత ఉద్యోగి అయిన సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసి, బెదిరించి… ఆ చర్య ద్వారా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఉల్లంఘించిన వంశీని ఎలా కలుస్తారని జగన్ ను ప్రశ్నించారు. దళితులపై కంటే కూడా వారిపై దాడులకు తెగబడే వంశీ లాంటి వారికి మద్దతు ఇస్తున్నారంటే… మీ వైఖరి ఏమిటో తెలపాలని కూాడా పల్లా ప్రశ్నించారు. ఇలా పలు కీలక అంశాలను జగన్ కు సంధించిన పల్లా… అసలు వంశీతో ములాఖత్ ద్వారా జనానికి ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలని కూడా ఆయన జగన్ ను ప్రశ్నించారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో మహిళలను అవమానించిన వంశీని ఏ రీతిన సమర్థిస్తావని కూడా ఆయన ప్రశ్నించారు. తల్లి, చెల్లిలపైనే అసభ్య పోస్టులు పెట్టించిన మీకు మహిళలంటే గౌరవం లేని వంశీ లాంటి వారే మంచిగా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు.

ఆపై గన్నవరం నియోజకవర్గం కేంద్రంగా సాగించిన అక్రమాల చిట్టాను పల్లా విప్పారు. పట్టిసీమ గట్టు మట్టిని అక్రమంగా తరలించి… రైతుల ద్రోహిగా వంశీ నిలిచారని ఆయన విమర్శించారు. వంశీ కారణంగా గన్నవరంలో 11 వేల మంది సొంతింటి కల దూరమైందన్న విషయాన్ని గుర్తు చేశారు. చెరువులు, కొండలను అక్రమంగా తవ్వించి గ్రావెల్ మాఫియాను నడిపిన వంశీకి మద్దతు ఎలా తెలుపుతారంటూ ఆయన జగన్ ను నిలదీశారు. ఎయిర్ పోర్టు భూములను కూడా వంశీ దురాక్రమించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బెజవాడ రూరల్ మండలంలో ఏకంగా 9 గ్రామాల్లో వంశీ భూకబ్జా కోరుగా ఉన్నారని కూడా పల్లా విమర్శించారు.