ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మెరుపులు మెరిపించారు. ఆంధ్రప్రదేశ్‌కు పవన్ కల్యాణ్ `ఆశాజ్యోతి` అంటూ కీర్తించారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ నేతల్లో పవన్ కల్యాణ్ చాలా డిఫరెంట్ నాయకుడని చెప్పుకొచ్చారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే రాజకీయాల్లో మనలేమన్న విషయం తనకు తెలుసునని, కానీ, పవన్ కల్యాణ్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడి అందరినీ మెప్పిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై పట్టుబట్టి.. మరీ భక్తులకు క్షమాపణలు చెప్పించడం ద్వారా.. బాధితులకే కాకుండా.. అందరికీ సంతోషం కలిగించిందన్నారు.
ఇక, రాష్ట్ర విభజన హామీలు.. రావాల్సిన బకాయిలను సాధించుకునేందుకు ఇదే సరైన సమయమని ఉండవల్లి పేర్కొన్నారు. కేంద్రంలో కూటమిగా ఉన్నందున.. ఇప్పుడు వాటిని సాధించుకునే అవకాశం టీడీపీ, జనసేనలకు ఉందన్నారు. పైగా.. ఈ విషయంలో పవన్‌కు ఎక్కువగా అవకాశం ఉందని ఉండవల్లి తెలిపారు. సనాతన ధర్మ దీక్ష చేయడం, ఆలయాలు దర్శించడంపై ఎవరో కొందరు విమర్శలు గుప్పించినంత మాత్రాన .. పవన్ కల్యాణ్ తన పంథానేమీ మార్చుకోబోడని అన్నారు. ఎన్నికలకు ముందు.. కాపు నాయకులే ఆయనను తప్పుబట్టినా.. తన మార్గాన్ని తాను కొనసాగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఏపీలోని టీడీపీ, జనసేనలపై బీజేపీ ఆధారపడి ఉందన్న ఉండవల్లి.. దీనిని వాడుకుని రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, విభజన హామీలను సాధించుకోవాలని పవన్‌కు సూచించారు. చంద్రబాబు ఆలోచనలు, వ్యూహాలు ఎవరూ అంచనా వేయలేరని, ఏం చేసినా.. రాష్ట్రం బాగుండాలనే తపన ఉంటే ఇప్పుడు కాకపోతే.. మున్ముందు అయినా ఫలిస్తుందని ఉండవల్లి తెలిపారు. పవన్ కల్యాణ్ తలచుకుంటే రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం ప్రజలకు కూడా ఉందని తెలిపారు. విభజన హామీల సాధనఫై ఏం చేస్తే బాగుంటుందో పవన్ కు తాను లేఖ రాసినట్లు ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు.
రాజకీయాల్లోకి రాను!
ఇక, రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇచ్చే విషయంపై స్పందించిన అరుణ్ కుమార్.. తనకు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదన్నారు. పైగా.. తాను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నానన్నారు. ఏ సమస్య వచ్చినా.. మాట్లాడుతున్నట్టు తెలిపారు. రేపు ఏదైనా పార్టీలోకి చేరితే.. ఆ పార్టీ తరఫున మాట్లాడాల్సి ఉంటుందన్నారు. ఇక, సాకే శైలజానాథ్ వంటివారు వైసీపీలో చేరడంపై.. స్పందిస్తూ.. ఎవరి ఇష్టం వారిదని, వైసీపీలో చేరినంత మాత్రాన ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు.