మహా కుంభమేళాలో పవన్ పుణ్య స్నానం

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహా కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించారు. మంగళవారం సతీసమేతంగా ప్రయాగ్ రాజ్ వెళ్లిన పవన్… సతీ సమేతంగానే పుణ్య స్నానాలు ఆచరించారు. పవన్ దంపతులతో పాటు పవన్ కుమారుడు అకీరా నందన్, టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ పుణ్య స్నానాల్లో పాలుపంచుకున్నారు. పుణ్య స్నానాల అనంతరం పవన్ తన చేతులతో అఖండ హారతిని పట్టుకుని కనిపించారు.

గత నెలలో ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ వేదికగా మొదలైన మహా కుంభమేళా ముగింపు దశకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ కుటుంబ సమేతంగా మహా కుంభమేళాకు వెళ్లారు. లోకేశ్ వెంట టీడీపీ నేతలు పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు, రఘురామకృష్ణరాజు, బీటెక్ రవి, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తదితరులు కూడా కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించిన సంగతి తెలిసిందే.

ఇటీవలే ధర్మ పరిరక్షణ యాత్రలో భాగంగా కేరళ, తమిళనాడుల్లోని పలు ఆలయాలను సందర్శించిన పవన్ కల్యాణ్…మొన్న విజయవాడ తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. శనివారం రాత్రి ఆయన విజయవాడలో జరిగిన మ్యూజికల్ నైట్ కు హాజరై…ఆదివారం ఒకింత విశ్రాంతి తీసుకుని మంగళవారం ప్రయాగ్ రాజ్ బయలుదేరి వెళ్లారు. మహా కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించిన తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడిన పవన్… కుంభమేళాకు యూపీ సర్కారు భారీ ఏర్పాట్లు చేసిందని కీర్తించారు. భాషా బేధాలు ఉన్నా… భారతీయులంతా మత పరంగా అంతా ఒక్కటేనని ఆయన వ్యాఖ్యానించారు.