వారు మాత్రమే మహిళలా?.. ట్రోల్స్ పై వంశీ సతీమణి ఫైర్!

సోషల్ మీడియా వేదికగా తనపైనా, తన కుటుంబంపైనా ఓ రేంజిలో ట్రోలింగ్ జరుగుతోందని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ సతీమణి పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడిని అపహరించి బెదిరించారంటూ వంశీని పోలీసులు అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆయన విజయవాడలోని జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… జైలులో వంశీతో ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు సమీపంలోనే ఆయన మీడియాతో మాట్లాడగా… ఆయన పక్కనే పంకజ శ్రీ కనిపించారు. జగన్ వెళ్లిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడిన పంకజ శ్రీ… సోషల్ మీడియా ట్రోలింగ్ పై ఓ రేంజిలో ఫైరయ్యారు.

తానెప్పుడూ బయటకు రాలేదన్న పంకజ శ్రీ.. తన భర్త వంశీ అరెస్టు కావడంతో తాను బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. తన భర్త కోసం తాను బయటకు వచ్చినంతనే తనపై అసభ్యంగా ట్రోలింగ్ మొదలుపెట్టారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్.. ప్రత్యేకించి మహిళలపై జరుగుతున్న ట్రోలింగ్ పై కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది కదా అని ఆమె గుర్తు చేశారు. ప్రభుత్వమే అంత కఠినంగా ఉంటే… తనపైనా, తన కుటుంబంపైనా అసభ్యంగా ఎలా పోస్టులు పెడతారని ఆమె నిలదీశారు. ఆ వెంటనే ఆమె ఓ సంచలన వ్యాఖ్య చేశారు. ఆ పార్టీకి చెందిన వారు మాత్రమే మహిళలా? అంటూ టీడీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇతర మహిళలు మహిళలు కారా? అని కూడా ఆమె ప్రశ్నించారు.

సోషల్ మీడియా ట్రోలింగ్ తక్షణమే ఆగాలని పంకజ శ్రీ హెచ్చరికలు జారీ చేశారు. లేదంటే లీగల్ గా తాను చర్యలు చేపట్టాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. ఈ దిశగా తాను అందరు ట్రోలర్ల పైనా ప్రైవేట్ కేసులు వేస్తానని కూడా ఆమె అన్నారు. ట్రోలర్లకు తమపైన ఏదైనా ఉంటే చట్టబద్ధంగా వెళ్లాలని ఆమె సూచించారు. ఏం చేసినా లీగల్ గా చేసింతవరకు అయితే ఒకే అన్న పంకజ శ్రీ… ఆ పరిధి దాటితే తాను కూడా కోర్టులను ఆశ్రయించాల్సి వస్తుందని తెలిపారు. మహిళల మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టవద్దని ఆమె కోరారు. ఈ సందర్భంగా పంకజ శ్రీ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే… వైసీపీ జమానాలో అసెంబ్లీలోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వంశీ చేసిన దారుణమైన వ్యాఖ్యలను టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. తాను ఓ మహిళనని బాధ పడుతున్న పంకజశ్రీ… నాడు భువనేశ్వరిపై తన భర్త చేసిన వ్యాఖ్యలను కూడా నాడు ఖండించి ఉంటే బాగుండేది కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా పంకజ శ్రీ చేసిన వ్యాఖ్యలు ఆమెపైకే బ్యాక్ ఫైర్ అయ్యాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.