ఎప్పుడూ అస్ధిరంగానే ఉండే దాయాది దేశం పాకిస్ధాన్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మళ్ళీ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. పాకిస్ధాన్ లో తాజాగా మొదలైన రాజకీయ సంక్షోభం చివరకు ఇమ్రాన్ మెడకే చుట్టుకుంటోంది. మొదటినుండి కూడా పాకిస్ధాన్ లో ప్రభుత్వాలపై సైన్యానిదే పెత్తనం అన్న విషయం తెలిసిందే. సైన్యాన్ని కాదని ఎవరు ఏమి చేయటానికి వీల్లేదు. పేరుకే ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరుగుతాయి కానీ తర్వాత ఏర్పడిన ప్రభుత్వం మాత్రం సైన్యం దయాదాక్షిణ్యాల పైనే ఆధారపడుటుందన్న విషయం ప్రపంచానికి అంతా తెలుసు.
తాజాగా సైన్యానికి, పోలీసులకు మధ్య ఒక్కసారిగా వార్ మొదలైంది. మామూలుగా సైన్యానికి ప్రభుత్వంలోని కీలక రాజకీయ నేతలకు మధ్య వార్ జరగటం సర్వ సాధారణం. కానీ ఇపుడు మాత్రం పోలీసు ఉన్నతాధికారులకు సైన్యంకు మధ్య వార్ మొదలైంది. దీన్ని ఎలా పరిష్కరించాలో ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు అర్ధం కావటం లేదు.
ఇంతకీ విషయం ఏమిటంటే ఇమ్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలోని 13 ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే మంగళవారం భారీ ర్యాలి తర్వాత పీఎంఎల్ పార్టీ నేత మరియం నవాజ్ భర్త సఫ్ధర్ ఆవాజ్ ను సైన్యం అదుపులో తీసుకుంది. అయితే అరెస్టు అక్రమం అంటూ మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. ఎక్కడైనా ర్యాలీలు, ఆందోళనలు జరిగితే పోలీసులు చర్యలు తీసుకోవాలి కానీ సైన్యానికి సంబంధం ఏమిటంటే గోల మొదలైంది.
ఈ కారణంగానే మంగళవారం అర్ధరాత్రి సైన్యం సింథ్ ప్రావిన్స్ పోలీసు ఐజి ముస్తాక్ మొహర్ ను అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి కిడ్నాప్ చేసింది. కిడ్నాప్ చేసిన ఐజీతో ఆవాజ్ అరెస్టుపై సంతకాలు చేయించుకుని తర్వాత వదిలిపెట్టింది. అంటే ఐజి ఆదేశాలు, అనుమతితోనే తాము ఆవాజ్ ను అరెస్టు చేశామని చెప్పుకునేందుకు సైన్యం ప్రయత్నించింది. ఈ విషయాన్ని మొహర్ తన పై అధికారులకు ఫిర్యాదు చేయగానే పెద్ద సంచలనమైంది.
సైన్యం చర్యలను తీవ్రంగా పరిగణించిన పోలీసు ఉన్నతాధికారులందరు సామూహిక రాజీనామాకు సిద్ధపడ్డారు. అసలే రాజకీయంగా అంతంత మాత్రంగా ఉన్న వాతావరణం సైన్యం, పోలీసుల మధ్య గొడవతో మరింత ముదిరిపోయింది. సైన్యం చర్యను సాకుగా తీసుకున్న రాజకీయ పార్టీలు బుధవారం అంతా పాకిస్ధాన్ లో రెచ్చిపోయాయి. దాంతో పాక్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా రంగంలోకి దిగి విచారణకు ఆదేశించారు. బజ్వా జోక్యంతో పోలీసు ఉన్నతాధికారులు తాత్కాలికంగా శాంతించినా ఎప్పుడేమి జరుగుతుందో ఎవరు చెప్పలేకున్నారు.